Kota Rukmini | ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సచివాలయంలో కనిపించడంతో అంతా ఈమె గురించే చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న ఈమె.. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో రావడం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది.
అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు కొత్త ఇసుక పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. కాగా, మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే జనసేన నేత కోట రుక్మిణి సచివాలయానికి వచ్చారు. మొదటి అంతస్తులో మీటింగ్ నడుస్తున్న సమావేశ మందిరం వైపు వెళ్లారు. అయితే కోట రుక్మిణి సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కావడంతో తొలుత పోలీసులు ఆమెను గుర్తించలేదు. దీంతో ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెంటనే కోట రుక్మిణి ఎవరికో ఫోన్ చేశారు. అలా ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే పవన్ కల్యాణ్ ఓఎస్డీ చాంబర్ నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆమెను లోపలికి అనుమతించారు. అయితే కీలక అంశాలపై కేబినెట్ భేటీ అయిన సమయంలో కోట రుక్మిణి సచివాలయంలోకి రావడంతో కారణం ఏమై ఉంటుందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆమెకు ఏమైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందా? అని కూడా అనుమానిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కోట రుక్మిణి పేరు బలంగా వినిపించింది. నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వింటారని అందరికీ తెలిసిందే. కానీ నాదెండ్ల కంటే కూడా కోట రుక్మిణి చాలా పవర్ఫుల్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. జనసేన నాయకులు ఎవరైనా సరే పవన్ కల్యాణ్‌ను కలవాలంటే కోట రుక్మిణి అనుమతి ఉండాల్సిందేనని.. ఆమె పర్మిషన్ లేకపోతే పార్టీ గేటు కూడా తాకలేరని టాక్ కూడా నడిచింది. అలాంటి ఆమె ఇప్పుడు సెక్రటేరియట్‌లోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణి లండన్‌లో ఉండేవారు. అక్కడ ప్రముఖ బ్రాండెడ్ షాప్ నిర్వహించేవారు. పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు కావాల్సిన సౌకర్యాలను రుక్మిణినే కల్పించేదని జనసేన నాయకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే 2020లో రుక్మిణిని జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్‌గా పవన్ కల్యాణ్ నియమించారు. 2022లో లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు. అప్పట్నుంచి ఆమె పార్టీలో కీలకంగా మారారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఒకటైన వీరమహిళ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కూడా రుక్మిణినే అని తెలుస్తోంది. అయితే పార్టీలో ఎదిగినకొద్దీ కార్యకర్తలను కలుపుకోవాల్సిందిపోయి.. ఆమె వారి మీద పెత్తనం చలాయిస్తున్నారని ఒక వ్యతిరేక ప్రచారం కూడా ఉంది.