Austira vs Romania : పొట్టి ఫార్మాట్ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్. అది టీ20 అయినా.. టీ10 అయినా బ్యాటర్ల విధ్వంసం ఓ రేంజ్లో ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ టీ20ల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌లు, రికార్డు ఛేదనలు చూసి వారెవ్వా అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు టీ10 మ్యాచుల్లో అద్భుతం జరిగింది. పసికూన ఆస్ట్రియా (Austria) జట్టు అసాధారణ విజయంతో సంచలనం సృష్టించింది. రొమేనియా (Romania)తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ బాదేసి క్రికెట్లో అసాధ్యమన్నదే లేదని నిరూపించింది. ఆస్ట్రియా హిట్టర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రొమేనియా నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ఆస్ట్రియా బ్యాటర్లు తడాఖా చూపించారు. సంచలన బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. లక్ష్య ఛేదనలో 8 ఓవర్లకు ఆస్ట్రియా స్కోర్.. 107/3. మ్యాచ్ గెలవాలంటే రెండు ఓవర్లలో 61 పరుగులు కావాలి. ఆ దశలో కెప్టెన్ అకీబ్ ఇక్బాల్(72 నాటౌట్) గేర్ మార్చాడు.
Austria chase 6️⃣1️⃣ runs in last 2 overs! 🤯#EuropeanCricket #EuropeanCricketInternational #StrongerTogether pic.twitter.com/Y8bLptmT56
— European Cricket (@EuropeanCricket) July 15, 2024
రొమేనియా బౌలర్ మన్మీత్ కొలిను ఉతికేస్తూ వరుసగా 6, 4, 6, 6 బాదాడు. ఇక్బాల్ విధ్వంసానికి జడిన కొలి ఐదు వైడ్స్, నో బాల్ కూడా వేయడంతో ఆ ఓవర్లో ఏకంగా 41 రన్స్ వచ్చాయి. ఇక 10వ ఓవర్లో సైతం ఇక్బాల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదేశాడు. దాంతో, ఆస్ట్రియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంతే.. ఆస్ట్రియా డగౌట్లో సంబురాలు మొదలవ్వగా.. ఆఖరి రెండు ఓవర్లలో అసలేం జరిగిందో అర్ధం కానట్టు రొమేనియా జట్టు బిక్క మొఖం వేసింది.