Doda Encounter | జమ్మూ డివిజన్ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దోడాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో జవాన్లు వీరమరణం పొందారని తెలిసి బాధపడ్డానన్నారు.
అమరజవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తోందన్నారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. ఉగ్రవాద అంతం చేయడానికి, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు సైనికులు కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో సైన్యం, పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ఎల్జీ మనోజ్ సిన్హా సంతాపం ప్రకటించారు. బలిదానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామన్నారు.
అమరులైన జవాన్ల కుటుంబాలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటిస్తూనే బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత సైన్యంపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరమన్నారు. జమ్మూకశ్మీర్లో భారత సైనికులపై ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఇందుకు బీజేపీ తప్పుడు విధానాలే కారణమని మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. భారత సైన్యంలోని అన్ని స్థాయి అధికారులు దోడాలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది అని పేర్కొన్నారు.