Paris Olympics : ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు పది రోజులే ఉంది. ఇప్పటికే విశ్వ క్రీడల కోసం భారత బృందం ప్యారిస్‌లో వాలిపోయింది. ఇక మిగిలిందల్లా విశ్వ క్రీడా సంబురం మొదల్వడమే. ఈ నేపథ్యంలో భారత యువ బాక్సర్ నిషాంత్ దేవ్ (Nishant Dev) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి తాను ఒలింపిక్ పతకం కొల్లగొడుతానని, కచ్చితంగా మెడల్‌తోనే తిరిగి వస్తానని నిషాంత్ వెల్లడించాడు. అమెరికా లెజెండరీ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్ జూనియర్ (Floyd Mayweather Jr) స్ఫూర్తిగా రింగ్‌లో చెలరేగిపోతానంటున్న ఈ యంగ్‌స్టర్ ఇంకా ఏం అన్నాడంటే..
‘నేను ప్రపంచంలోనే గొప్ప బాక్సర్ అని నాకు తెలుసు. నేను ఎవరికీ భయపడను. ఇంకా చెప్పాలంటే.. నేను పుట్టిందే ఒలింపిక్ మెడల్ సాధించడం కోసం. నాకు ఎంతో ఇష్టమైన ఆలూ, పరోటాకు దూరమై ఇప్పటికీ మూడు నెలలు అయింది. అంతేకాదు పర్యటన సమయంలో ఎన్నో సుందర ప్రదేశాలు చూశాను. అయితే.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచినప్పుడే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ వెండి, కాంస్య పతకమైనా ఓకే. కానీ, నా లక్ష్యం మాత్రం పసిడి మీదే. ‘ అని నిషాంత్ ధీమాగా చెప్పాడు. విశ్వ క్రీడల్లో నిషాంత్ 71 కిలోల విభాగంలో తలపడనున్నాడు.

ఒలింపిక్స్ పేరు వింటే చాలు ఒకప్పుడు పతకాలను వేళ్ల మీద లెక్కించుకోవాల్సిన పరిస్థితి. హాకీలో తప్ప మరే ఆటలోనూ భారత్‌కు మెడల్స్ రాని రోజులే కళ్ల ముందు మెదులుతాయి. కానీ, ఈతరం భారత అథ్లెట్లు పతకాల భరోసా ఇస్తున్నారు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు తామేమీ తక్కువ కాదని చాటుతూ విశ్వ క్రీడల్లో పతకం గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. సిద్ధమయ్యారు.
హకీ, షూటింగ్, బ్యాడ్మింటన్, జావెలిన్ త్రో, బాక్సింగ్, రెజ్లింగ్, 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌తో పాటు 400 మీటర్ల రీలే పరుగులో ఈసారి ఇండియాకు పతకాలు ఖాయమనిపిస్తోంది. జూలై 26వ తేదీన ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ షురూ కానుంది. 118 మందితో కూడిన భారత బృందం ఈసారి రికార్డు స్థాయిలో పతకాలు సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉంది.