హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు నిరోధక చట్టానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి సోమా భరత్‌కుమార్, పార్టీ లీగల్‌సెల్ ప్రతినిధి లలితారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చారని, సుప్రీంకోర్టు సైతం ఈ కేసును క్లోజ్ చేసినట్టు ప్రకటించిందని తెలిపారు. అయితే స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వడం లేదని తమ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. దీంతో 48 గంటల్లో తీర్పు కాపీలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తీర్పు కాపీల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
రెండేండ్ల క్రితం పిటిషన్ వేస్తే స్పీకర్ ఇప్పుడు తీర్పు ఇచ్చారని, ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారని గుర్తుచేశారు. 1/3 వంతు సభ్యులు వేరే పార్టీలోకి వెళ్తే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టంలో పేర్కొన్నారని చెప్పారు. 2003లో వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2/3వ వంతు సభ్యులు పార్టీ మారితే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టం చేశారని వివరించారు. రాజీవ్‌గాంధీ, కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని రేవంత్ చంపేశారని మండిపడ్డా రు. దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తీర్పు చెప్పినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని వినోద్‌కుమార్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పితే దాన్ని జాతీయ జెండా అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందని అందరూ భావించారని, ఉపఎన్నికలు వస్తే గెలువలేమన్న భయంతోనే వారు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దానం నాగేందర్ అఫిడవిట్ ఫైల్ చేసి కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారని, ఒక వ్యక్తి ఒకేసారి రెండు, మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా లేదా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ బీఫామ్‌పై లోక్‌సభకు పోటీచేస్తే పార్టీ మారలేదని స్పీకర్ ఎలా చెప్తారని నిలదీశారు. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కళంకం తెచ్చారని ఫైర్ అయ్యారు. దీనిపై రాహుల్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఎమర్జెన్సీ పెట్టినందుకు ఇందిరాగాంధీని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. స్పీకర్ తీర్పును ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలిచి బీఎస్పీలో చేరితే యూపీలో ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారని గుర్తుచేశారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు స్పష్టంచేశారు.