Kidney Scam | ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్‌ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో మొత్తం ఐదుగురిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్‌బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు చిన్నపాటి వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా తర్వాత ఆర్థికంగా చితికిపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్‌గా మారాడు.. కానీ గతంలో చేసిన అప్పులు మాత్రం తీర్చలేని దుస్థితిలో ఉండిపోయాడు. ఇలాంటి సమయంలోనే బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో మధుబాబుకు పరిచయమయ్యాడు. కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా గతంలో అలాగే ఓ కిడ్నీ అమ్మేసుకున్నానని నమ్మబలికాడు. దీంతో మధుబాబు కూడా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయం బాషాకు చెప్పడంతో అతను వెంకట్ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు.
వెంకట్ ద్వారా కిడ్నీ అమ్ముకుంటే రూ.30 లక్షలు ఇస్తాడని బాషా నమ్మబలికాడు. దీంతో వెంకట్ అడిగిన వివరాలన్నీ మధుబాబు చెప్పాడు. కొద్ది నెలల పాటు నెలవారీ ఖర్చులు కూడా వెంకట్ ఇచ్చాడు. ఈ క్రమంలో గత నెల 15వ తేదీన విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి మధుబాబుకు ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాడు. దాన్ని వేరే వ్యక్తికి సెట్ చేశారు. ఆపరేషన్ తర్వాత మధు బాబుకు ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. అదేంటి మిగిలిన డబ్బులు ఇవ్వాలని మధుబాబు అడగ్గా.. వెంకట్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. పేషెంట్ స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావు.. నీకు డబ్బులు ఎందుకివ్వాలని మధుబాబును ఎదురు ప్రశ్నించాడు. నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తులపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశాడు. ఈ వ్యవహారంలో బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్‌బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.