Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను మంత్రి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా మరో ట్వీట్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ప్రకటన చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేశారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయంలో సందిగ్ధత ఏర్పడింది. కాగా, ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక విధానం జీవోకే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పౌరసరఫరాల శాఖ రూ2వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతినిచ్చింది.
దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.