AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ విద్యార్థిని శైలజ స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే తన అన్నతో కలిసి సోమవారం ఉదయం ఆమె బడికి వెళ్లింది. బడి అయిపోయిన తర్వాత అన్న ఒక్కడే ఇంటికి వెళ్లాడు. అక్కడ చెల్లి ఏదని తల్లి అడగడంతో వెంటనే స్కూల్‌కు వెళ్లి టీచర్లను అడిగాడు. దానికి ఒంట్లో బాగోలేదని శైలజ మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో కంగారుపడిన బాలిక అన్న, తల్లి ఇద్దరూ ఊరంతా వెతికారు. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద శైలజ చెప్పులు కనిపించాయి.
అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా మంచంపై శైలజ చలనం లేకుండా కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు ఆ ఇంటి తాళం పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం నాగరాజు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై హత్యాచారం జరిగి 10 రోజులు దాటినా మృతదేహాన్ని పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఆరోపించింది. అభం శుభం తెలియని ఆడబిడ్డలపై హత్యాచార ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయని పేర్కొంది. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేని మహిళా హోం మంత్రి వంగలపూడి అనితకు పదవి అవసరమా? అని ప్రశ్నించింది.