హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ‘రాహుల్జీ..రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నానని రాజ్యాంగప్రతులను పట్టుకొని దేశమంతా పర్యటిస్తారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదరగొడతారు. మరి తెలంగాణలో మీ పార్టీ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహించడం కనిపిస్తలేదా? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దానం నాగేందర్ మీ పార్టీ బీఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయలేదా? ఇవి ఊహాగానాలు కావు. పుకార్లు అంతకంటే కావు. పక్కా రుజువులున్నా కాంగ్రెస్‌కు చెందిన స్పీకర్ కాదంటున్నరు. దీనిపై మీరేమంటరు?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నాస్ర్తాలు సంధించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ విచారణ ముగించడం, కోర్టు సైతం ఈ కేసును కొట్టివేసిన నేపథ్యంలో హరీశ్‌రావు శుక్రవారం రాహుల్‌గాంధీకి బహిరంగలేఖ రాశారు.
ఇందులో కాంగ్రెస్ ద్వంద్వవైఖరి, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని ఎండగట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామని, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సమర్థిస్తామని కాంగ్రెస్ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ‘తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపు వ్యవహారాలకు, మీరు జాతీయస్థాయిలో చేసే బోధనలకు పొంతనలేదనే విషయం మీ చేతల ద్వారా స్పష్టమవుతున్నది. మీ పార్టీ అధికారంలో ఉన్నచోట ఆచరణలో స్పష్టమైన వైరుధ్యాన్ని బహిర్గతం చేస్తున్నది’ అని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని పోటీచేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపునకు ఇంతకం టే ఇంకేం ఆధారాలు కావాలని నిలదీశారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని దేశం మొత్తం తెలుసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ దేశానికి ఉపదేశించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని ప్రశ్నించారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆధారాలు, ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తూ స్పీకర్‌కు లేఖరాశానని హరీశ్ గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తు స్పీకర్ తన సూచనలు, విజ్ఞప్తులను పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఆయన తీరు ను చూసిన తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాతీర్పును పరిహసించాలని నిశ్చయించుకున్నదనే విషయం తేటతెల్లమైందని విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ పదేపదే చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఆచరణలో ఉత్తదేనని తేల్చిచెప్పారు. రాహుల్ రాజ్యాంగ స్ఫూర్తి ఒక రాజకీయ విధానమనే విషయం తెలిసిపోతున్నదని దుయ్యబట్టారు.
‘రాహు ల్.. మీరు ఢిల్లీలో రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకోలేరు. అదే సమయంలో మీ పార్టీ తెలంగాణలో రాజ్యాంగాన్ని పలుచనచేసే చర్యలకు అనుమతిస్తారు. ఈ పరిస్థితుల్లో నేను సూటిగా అడుగుతున్నా..ఫిరాయింపు నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని మీ పార్టీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌కు సూచిస్తారా? లేక ‘మాకు అవసరమైప్పుడే రాజ్యాం గ విలువల గురించి మాట్లాడుతం’ అని ఒప్పుకొంటారా? నిజాయితీగా సమాధానం చెప్పా లి?’ అని ప్రశ్నించారు. ప్రసంగాల ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని రక్షించడం కాదని, చర్యల ద్వా రా సమర్థించాలని చురకలంటించారు.