IPL 2025 : ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడం.. ఐపీఎల్ 18వ సీజన్ వాయిదాతో పలు దేశాలు తమ క్రికెటర్లు భద్రత గురించి ఒకింత ఆందోశన చెందాయి. కొన్ని బోర్డులు అయితే తమ ప్లేయర్లను స్వదేశానికి రావాల్సిందిగా కోరాయి. యుద్ధ వాతావరణం మధ్యలోనే ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లను ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలించింది బీసీసీఐ. తద్వారా ఆటగాళ్ల భద్రత మా బాధ్యత అని చాటుకుంది.
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సైతం తమ ఆటగాళ్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. వారంతా క్షేమంగా బెంగళూరకు చేరుకున్నారని శనివారం ఎక్స్ వేదికగా ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. ‘మా జట్టు క్రికెటర్లు, సహాయక సిబ్బంది సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వారు తమ తమ నగరాలకు వెళ్లనున్నారు. విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది తమ దేశానికి బయల్దేరనున్నారు. ఉత్కంఠ నెలకొన్న ఈ పరిస్థితుల్లో మా అందర్నీ క్షేమంగా తరలించిన బీసీసీఐ, స్థానిక అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని ఆర్సీబీ యాజమాన్యం ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Our players and extended staff have safely returned to Bengaluru and are now homebound to their respective cities and countries. 🙌
We’re deeply grateful for the swift coordination and support from the BCCI, local authorities, and the police who made this possible. 🙏🇮🇳… pic.twitter.com/8IatIo5Wwl
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 10, 2025
మే 7వ తేదీ నుంచి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కారణంగా ఐపీఎల్ వారం వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో, మే 9న ఎక్నా స్టేడియంలో జరాగాల్సిన లక్నో, బెంగళూరు రద్దు అయింది. అయితే.. అప్పటికే లక్నో చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు అక్కడే ఉండిపోయారు. సో.. శనివారం బీసీసీఐ, స్థానిక అధికారులు, పోలీసుల సమన్వయంతో కోహ్లీ సహా అందరూ సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు. దాంతో, ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ పాటించడంతో ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగింపుపై అందరి దృష్టి నెలకొంది. ఆటగాళ్ల భద్రత గురించిన భయాలు తొలగిపోవడంతో.. మిగతా 16 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుంది? అని అందరూ ఎదురు చూస్తున్నారు.