ఖిలా వరంగల్, మే 10 : గుర్తు తెలియని వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. సుమారు 70 ఏళ్ల వృద్ధుడు కాజీపేట వరంగల్ రైల్వేస్టేషన్లో మధ్యనున్న 376/6-8 మైలురాయి వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు బ్లాక్ కలర్ పాయింట్, వైట్ కలర్ ఫుల్ షర్టు ధరించి ఉన్నాడు. అలాగే మృతుడి వద్ద చేతి కర్ర తప్ప ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు వరంగల్ రైల్వే స్టేషన్లోని జీఆర్పి పోలీస్ స్టేషన్లో గాని లేదా ఎంజీఎం మార్చురీలో సంప్రదించాలని పేర్కొన్నారు.