Unemployees | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. ఎన్నో ఆశలతో రెండున్నరేండ్లుగా కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు కదనభేరి మోగించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పోరుబాట పడుతున్నారు. నిరుద్యోగులంతా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
రేపటి నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. పోలీస్‌శాఖలో తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ‘పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ’ డిమాండ్ చేస్తున్నది. భారీగా నిరసలకు పిలుపునిచ్చింది. భారీ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే ఆవిష్కరించింది. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని, జీవో 46ను రద్దు చేయాలని, లాంగ్‌జంప్‌ను 3.8 మీటర్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసన చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్‌లా నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు తరలిరావాలని జేఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలీస్ ఉద్యోగార్థులకు అలవిగాని హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కర్ణాటక తరహాలో ఉద్యమిస్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జనరల్ ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ నిరుద్యోగ జేఏసీ’ ఆధ్వర్యంలో 13న నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైనందున నిరుద్యోగ మార్చ్‌కు భారీగా నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 13న అసెంబ్లీ ముట్టడితోపాటు, టీజీపీఎస్సీని కూడా ముట్టిస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలలోపు సీసీఎస్ఏ ద్వారా 5,944 జీపీవో పోస్టులను, టీజీఎల్పీఆర్బీ ద్వారా 14 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు, 25వేల ఖాళీలు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించేందుకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో బ్యాగ్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఏడాదికి ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో, బడ్జెట్ సమావేశాలలోపు అన్నిశాఖల్లో ఉన్న ఖాళీలతో మరో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2024 ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంలా మారిపోయిందని మండిపడుతున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయని ఆశించామని, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కోచింగ్ సెంటర్లలోనే సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో డబ్బులు పంపేందుకు కూడా తల్లిదండ్రులు సంకోచిస్తున్నారని, స్వగ్రామాలకు వెళ్తే తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. జీపీవో, ఎస్సై, పీసీ పోస్టుల కోసం సిద్ధమవుతున్న సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ నిరసనలకు ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని రెండు జేఏసీలు పిలుపునిచ్చాయి.