IPL 2025 : ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతాయి. హోరాహోరీగా జరిగే పోరాటాలను వీక్షించేందుకు అభిమానులు అమితాసక్తి చూపిస్తుంటారు. ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)మ్యాచ్ కూడా అలాంటిదే. తొలి సీజన్ నుంచి పోటాపోటీగా ఆడే ఈ రెండు జట్లు 18వ సీజన్లో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ మ్యాచ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో గత రికార్డులను పరిశీలిస్తే ఈ మైదానంలో 10 ఏళ్లుగా బెంగళూరు ఓడిపోతూనే ఉంది. చివరిసారిగా 2015 ముంబైపై గెలుపొందిన ఆర్సీబీ.. ఈసారి ఎలాగైనా మాజీ ఛాంపియన్‌కు చెక్ పెట్టాలనే కసితో ఉంది. సొంత మైదానంలో పంజా విసిరే ముంబైని నిలువరించాలంటే ఆర్సీబీ సర్వశక్తులు ఒడ్డాల్సిందే.
వాంఖడేలో 2015లో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్లను ఉతకారేశారు కోహ్లీ, ఏబీ డివిలియర్స్. 59 బంతుల్లోనే డివిలియర్స్ 133 పరుగుతో అజేయంగా నిలవగా.. కోహ్లీ 82 నాటౌట్‌గా మెరపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీళ్లు లసిత్ మలింగ, బుమ్రా బౌలింగ్‌ను చీల్చి చెండాడి.. 215 రన్స్ జోడించి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. వీళ్లిద్దరి విధ్వంసంతో ఆర్సీబీ వికెట్ నష్టానికి 235 పరుగులు కొట్టింది బెంగళూరు. ఛేదనలో ముంబై దీటుగా బదులిచ్చింది. 200 ప్లస్ స్కోర్ చేసింది. కానీ, 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
పద్దెనిమదో సీజన్‌ను విజయంతో ఆరంభించిన ఆర్సీబీ.. చెపాక్‌లో 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై తొలిసారి గెలుపొందింది. అయితే.. హ్యాట్రిక్ విక్టరీ కొడుతుందనుకున్న వేళ.. గుజరాత్ టైటన్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం రెండు విజయాలు, 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతోంది. చెన్నైపై విజయం స్ఫూర్తితో.. ముంబై సొంత గడ్డపై పదేళ్ల పరాజయాల పరంపరకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో రజత్ పాటిదార్ బృందం బరిలోకి దిగనుంది. కానీ.. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడుతుండడం ముంబైకి ప్లస్ పాయింట్ కానుంది.
𝙁𝙡𝙤𝙖𝙩𝙞𝙣𝙜 𝙡𝙞𝙠𝙚 𝙖 𝙗𝙪𝙩𝙩𝙚𝙧𝙡𝙮, 𝙨𝙩𝙞𝙣𝙜𝙞𝙣𝙜 𝙡𝙞𝙠𝙚 𝙖 𝙗𝙚𝙚 🔥
🎥 Jasprit Bumrah is back!
P.S. – Watch out for a toe-crushing yorker special 😎#TATAIPL | #MIvRCB | @Jaspritbumrah93 pic.twitter.com/VLLIKgs0ko
— IndianPremierLeague (@IPL) April 7, 2025
పవర్ ప్లేలో ఈ యార్కర్ కింగ్ విజృంభిస్తే బెంగళూరుకు కష్టాలు తప్పకపోవచ్చు. గాయం కారణంగా లక్నోసూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశముంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఆర్సీబీ కోహ్లీపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ శుభారంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ రాణిస్తున్నా.. కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మలు నిరాశపరుస్తున్నారు. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకూ అందరూ సమిష్టిగా ఆడితే తప్ప ముంబైపై భారీ స్కోర్ చేయడం అసాధ్యం. రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.