Jagadgiri Gutta | అధికారుల ప్రణాళికా లోపం, పనుల్లో నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామిక, వాణిజ్య సముదాయాల ప్రాంతం ప్రధాన రహదారిలో రెండేళ్ల క్రితం డివైడర్ ఏర్పాటు చేసి రోడ్డు విస్తరించారు. పలుచోట్ల లోతట్టుగా ఉండడంతో వర్షాకాలం నీరు చేరి ఇబ్బందులు నెలకొంటున్నాయి.
ఈ నేపథ్యంలో 8 నెలల క్రితం రూ. 1.60 కోట్లు కేటాయించారు. వీటితో ఎర్ర గోడల నుంచి శివాజీ విగ్రహం వరకు వరద కాలువ ఏర్పాటు చేసి నీరు సాఫీగా వెళ్లేలా అంతర్గత డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. పారిశ్రామిక నిధులతో మొదలైన పనులు ఆదిలోనే హంసపాదు చందంగా ఆగిపోయాయి. పలుచోట్ల రాతి నేల ఉండడంతో గుత్తేదారు తవ్వి పనులు చేయలేక చేతులెత్తేశాడు. రెండు నెలలుగా ఆ రోడ్డుపై వ్యర్ధాలు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
ప్రధాన రహదారి జలమయంగా మారి..
పనులు చేయకపోయినా కనీసం వ్యర్థాలైనా పక్కకు తరలించకుండా వదిలేయడం సరికాదని పలువురు వాపోతున్నారు. పనుల పురోగతిపై దృష్టి సారించని అధికారులు సాంకేతిక సహాయంతో పనులు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల అకాల వర్షాలకు గాంధీనగర్ ప్రధాన రహదారి జలమయంగా మారి గంటల తరబడి రోడ్డుపై నీరు నిలిచిపోయింది.
ఇక వర్షాకాలంలో భారీగా కురిసే వాన నీరు ఎలా పోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు పరిశీలన చేపట్టి పనులు జరిగేలా చూడాలని స్థానికులు, పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. ఇదే పరిస్థితి జగదిగిరిగుట్ట నుంచి షాపూర్ వెళ్లే దారిలోనే బ్రిడ్జి వద్ద ఉంది.
బ్రిడ్జి పనుల నేపథ్యంలో తాత్కాలికంగా ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు గోతులమయంగా ఉన్న రహదారిపై రాత్రిపూట ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. రహదారి గుంతలు పూడ్చి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.