Rajpal Yadav | బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీలోని తీహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే లొంగిపోయే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తీహార్ జైలుకు చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన, కన్నీటి పర్యంతమవుతూ.. తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో తనకు స్నేహితులెవరూ లేరని, ఈ సంక్షోభాన్ని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలని విలపించాడు. ఇక రాజ్‌పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగింది.?
2010లో రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా నిర్మాణంతో ఈ వివాదం మొదలైంది. ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో రాజ్‌పాల్ ఆర్థికంగా చితికిపోయారు. అప్పు తీర్చడానికి ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవ్వడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు 2018లోనే ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై ఆయన ఎన్నోసార్లు అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. వడ్డీతో కలిపి ఆ అప్పు ఇప్పుడు దాదాపు రూ.9 కోట్లకు చేరినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయన శిక్ష అమలుపై రాయితీ ఇవ్వడానికి నిరాకరించి, వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో ఫిబ్రవరి 5న ఆయన జైలు అధికారుల ముందుకు వెళ్లారు. కోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదిస్తూ.. రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటికే రూ.75 లక్షలు చెల్లించారని, మిగిలిన బకాయిల కోసం కొంత సమయం కావాలని కోరినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. తెలుగు ప్రేక్షకులకు రవితేజ ‘కిక్ 2’ సినిమా ద్వారా సుపరిచితుడైన ఈ విలక్షణ నటుడు, కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే నేడు తీహాడ్ జైలులో ఆరు నెలల శిక్ష అనుభవించాల్సి రావడం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.