Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంతో, కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు గెలుచుకుని తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం ప్రత్యేక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత నిహారిక కొణిదెల తన ఆనందాన్ని భావోద్వేగంతో పంచుకున్నారు. తమ కుటుంబానికి జాతీయ అవార్డులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. సరిగ్గా 36 ఏళ్ల క్రితం మా నాన్న నాగబాబు నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘రుద్రవీణ’ మూడు జాతీయ అవార్డులు అందుకుంది.
ఇప్పుడు నేను నిర్మాతగా పూర్తి బాధ్యతతో నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ కూడా రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. మా కుటుంబ చరిత్ర మరోసారి పునరావృతమైనట్టుగా అనిపిస్తోంది” అని తెలిపారు. నేషనల్ అవార్డు సాధించాలనే లక్ష్యంతో ఈ సినిమాను ప్రారంభించలేదని, అయితే దర్శకుడు యదు వంశీ చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే బలమైన కోరిక తనలో కలిగిందని నిహారిక వెల్లడించారు. ఇప్పుడు ఆ కల నిజం కావడం ఎంతో సంతృప్తినిస్తోందని చెప్పారు. ఈ అరుదైన విజయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారని, ఆయన నుంచి వచ్చిన ప్రశంసలు తనకు మరింత ప్రేరణనిచ్చాయని నిహారిక తెలిపారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ఈ కథపై మొదటి నుంచే పూర్తి నమ్మకం ఉందని, ఈ సినిమాతో జాతీయ అవార్డు వస్తుందని ముందుగానే విశ్వసించానని చెప్పారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, రాధ్యా, తేజస్వీరావు తదితర యువ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుల రూపంలో మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది.