Palla Rajeshwar Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను బొచ్చు కుక్క అని విమర్శిస్తోందని అన్నారు. అవును నేను కుక్కనే.. నన్ను నమ్మిన కేసీఆర్కు విశ్వాసమైన కుక్కలా ఉంటా.. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దుంకే నీలాంటి గుంటనక్కను మాత్రం కాను అంటూ సెటైర్ వేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని తెలిపారు. అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలో, ప్రజల భూములను కాపాడటంలో రేసు కుక్కలా ఉండి పోరాడతానని పేర్కొన్నారు.
అవును నేను కుక్కనే.. నన్ను నమ్మిన కేసీఆర్కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దుంకే నీలాంటి గుంట నక్కను మాత్రం కాదని స్పష్టంచేశారు.