Ravi Shastri : ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 10 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్న విరాట్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri)కి మాత్రం ఈ విషయం ముందే తెలుసట. ఇదే అంశంపై శాస్త్రిని ప్రశ్నిస్తే.. అవును నాకు ముందే తెలుసు. నాతో మాట్లాడిన తర్వాతే కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు అని వెల్లడించాడు.
టీమిండియా కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రవిశాస్త్రికి కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. శాస్త్రి హయాంలోనే విరాట్ కెప్టెన్‌గా జట్టును నంబర్ 1గా నిలిపాడు. కోచ్, సారథిగా కంటే.. స్నేహితుల్లా పలు విషయాలు చర్చించుకునేవాళ్లు ఇద్దరూ. కాబట్టే విరాట్ టెస్టులకు అల్విదా పలకడానికి ముందు రవిశాస్త్రితో మాట్లాడాడు. ‘అవును.. రిటైర్మెంట్ ప్రకటను వారం రోజుల ముందు కోహ్లీ నాతో మాట్లాడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు తాను చేయగలిగినంతా చేశానని.. ఇకపై వీడ్కోలు చెప్పడమే మిగిలిందని అన్నాడు’ అని శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
‘ఇష్టమైన టెస్టులకు గుడ్ బై చెబుతున్నందుకు ఏమైనా బాధగా ఉందా?’ అని నేను కోహ్లీని అడిగాను. అందుకు అతడు అదేమీ లేదని చెప్పాడు. అయినా సరే నేను ఒకటి రెండు ప్రశ్నలు వేశాను. అందుకు అతడు.. తాను స్పష్టంగా ఉన్నానని.. తన మనసులో ఎలాంటి సందేహాలు లేవని బదులిచ్చాడు. సో.. అప్పుడే నాకు అతడి వీడ్కోలుకు సరైన సమయం వచ్చిందని అనిపించింది. మామూలుగా ఏ క్రికెటర్ అయినా బ్యాటింగ్ చేశామా తమ పని అయిపోయిందిలే అనుకుంటారు. కానీ కోహ్లీ అలాకాదు.
మైదానంలో చిరుతులా కదులుతాడు. అన్ని వికెట్లు తానే తీయాలని.. అన్ని క్యాచ్‌లు తానే పట్టాలని ఆరాటపరుతాడు. ప్రత్యర్థుల కవ్వింపులకు అంతే స్థాయిలో బదులిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తాడు. అందుకే.. అతడి ఆట చూసేందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రజలు స్టేడియాల్లో వాలిపోయేవారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోహ్లీ.. మరో రెండు మూడేళ్లు టెస్టులు ఆడుతాడని అనుకున్నా. కానీ, వీడ్కోలుతో నన్ను ఎంతో ఆశ్చర్యపరిచాడు’ అని మాజీ కోచ్ చెప్పుకొచ్చాడు.
భారత టెస్టు క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అతడి సారథ్యంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన టీమిండియా.. డబ్ల్యూటీసీ (WTC 2023) ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ 68 టెస్టులకు సారథ్యం వహించగా.. 40 మ్యాచుల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. అయితే.. నిరుడు న్యూజిలాండ్‌పై, ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ విఫలమయ్యాడు.
All the records set by @imVkohli during his incredible Test career 🏏
Read here ⬇️https://t.co/mFVxiuH7Jt pic.twitter.com/i8j6oK8IpU
— Guinness World Records (@GWR) May 12, 2025
ఒకే ఒక సెంచరీ మినహా పెద్ద స్కోర్లు చేయలేదు. పైగా.. అతడి సగటు 50 నుంచి 46కు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. కామెంటేటర్ల నుంచి ఇక విరాట్.. వీడ్కోలు పలికడమే మంచిదనే కామెంట్లు వినిపించాయి. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైతే.. బాధతో ఆటకు అల్విదా పలకాల్సి వస్తుంది అనుకున్నాడు కాబోలు.. ఎవరికీ విమర్శించే అవకాశం ఇవ్వకుండా రన్ మెషీన్ విరాట్.. హుందాగా గుడ్ బై చెప్పేశాడు. రోహిత్ శర్మ మే 7న రిటైర్ కాగా.. కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు.