మైలార్‌దేవ్‌పల్లి : దోమల నివారణకు ప్రజలు తమ ఇళ్లతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి నుంచి శివాజీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి అని, దీని నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. పూల కుండీలు, పాత టైర్లు తదితర వాటిలో నీరు లేకుండా చూడాలన్నారు. ఫాగింగ్ మెషిన్లు, స్ప్రే యంత్రాల సాయంతో దోమల నివారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. డెంగ్యూ లక్షణాలు జర్వం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, దద్దుర్లు వంటివి ఉంటాయన్నారు. డెంగ్యూకు నిర్ధిష్టమైన చికిత్స లేదన్నారు. కానీ లక్షణాలను తగ్గించేందుకు వైద్య సహాయం అవసరమన్నారు. రాబోయే వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటింటా దోమల నివారణకు దోమ తెరలు వాడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతో మాత్రమే దోమలపై విజయవంతంగా పోరాడగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.