అమరావతి : తూర్పుగోదావరి జిల్లారాజమహేంద్రవరంలో కల్తీ పాలు ( Milk Adulteration ) తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ( YS Jagan ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కోరారు.
వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని డిమాండ్ చేశారు.