బంట్వారం : ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను( Students Number ) గణనీయంగా పెంచాలని డీఈవో రేణుకాదేవి ( DEO Renukadevi ) పేర్కొన్నారు. శుక్రవారం కోట్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో తల్లిదండ్రులతో ‘ బడిబాట కార్యక్రమం’ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ యేడాది నుంచి ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రైవేటు పాఠశాలలో చదివించడం వల్ల తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతాయని, అదే ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఫీజులు లేకుండా, అన్ని రకాల పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, అల్పహారం అందిస్తుందని తెలిపారు. ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయుల బోధన ఉంటుందని, డిజిటల్ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సౌకర్యాలు ఉన్న పాఠశాలలను మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లోని మహిళ సంఘాల ప్రతినిధులు, సభ్యులు చొరవ తీసుకుని పిల్లలందరూ ప్రభుత్వ బడిలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చంద్రప్ప, కేజీబీవీ ప్రిన్సిపాల్ పల్లవి, మహిళ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.