న్యూఢిల్లీ: ఒక ఆస్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ని బిల్డర్ పొందకుండా దాన్ని స్వాధీనం చేసుకోవాలని గృహ కొనుగోలుదారుడిని ఒత్తిడి చేయలేరని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. డెవలపర్ వైపు నుండి అలాంటి వైఫల్యం సేవలో లోపంగా పరిగణించాల్సి ఉంటుందని, గృహ కొనుగోలుదారులు డెవలపర్ నుంచి పరిహారం పొందేందుకు అర్హులని న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో చేసిన అధికారిక ప్రకటనలను ఉటంకిస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం చట్టబద్ధమైన స్వాధీన పంపిణీలో అంతర్భాగమని తెలిపింది.
మోహిత్ భిర్బత్, ఇతర ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను అందించడంలో, ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో జాప్యం చేసిన పార్సనాథ్ డెవలపర్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందకుండా యథాతథ స్థితి ప్రాతిపదికన ఫ్లాట్లను స్వాధీనం చేసేందుకు డెవలపర్ అందచేసిన ప్రతిపాదనను ధర్మాసనం తిరస్కరించింది. కేసు వివరాలను పరిశీలిస్తే& కొందరు గృహ కొనుగోలుదారులు 2007, 2011 మధ్య గుర్గావ్లోని సెక్టార్ 53 వద్ద ఉన్న పార్సనాథ్ ఎక్సోటికా ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసి దాదాపు మొత్తం డబ్బు చెల్లించారు. ఒప్పందాల ప్రకారం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి 36 నెలల్లో ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌తో ఫ్లాట్లను కొనుగోలుదారులకు డెవలపర్ అందచేయాలి.
నిర్ణీత సమయంలోపు లేదా పొడిగించిన సమయంలోపు బిల్డర్ ఫ్లాట్లను వారికి అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించారు. డెవలపర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాలని, నిర్ణీత సమయం లోపు ఆస్తిని అప్పగించాలని 2018 జూలై 30, 2019 నవంబర్ 21న జారీ చేసిన ఉత్తర్వులలో కమిషన్ ఆదేశించింది. కటాఫ్ తేదీల నుంచి ఆస్తిని అప్పగించే వరకు ఏడాదికి 8 శాతం సాధారణ వడ్డీ ద్వారా పరిహారం చెల్లించాలని, అంగీకరించిన తేదీల తర్వాత పెరిగిన స్టాంప్ డ్యూటీని భరించాలని, ప్రతి కేసులో వ్యాజ్యం ఖర్చుగా రూ.25 వేలు చెల్లించాలని పార్సనాథ్ డెవలపర్స్‌ని కమిషన్ ఆదేశించింది. ఎన్సీడీఆర్సీ ఆదేశాలను బిల్డర్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.