James Anderson : ఐపీఎల్ 18వ సీజన్లో ఆడే అవకాశం కోల్పోయిన ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ (James Anderson) మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. కౌంటీల్లో ఆడేందుకు అంగీకరించిన అండర్సన్ ల్యాంక్‌షైర్ (Lancashire) స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. వీడ్కోలు తర్వాత అతడు ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే. దాంతో, మరోసారి ఈ లెజెండరీ పేసర్ బౌలింగ్ చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ల్యాంక్‌షైర్ 42 ఏళ్ల అండర్సన్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో మేటి ఆటగాళ్లను తన స్వింగ్‌తో బెంబేలెత్తించిన ఈ మాజీ పేసర్.. ఇప్పుడు కౌంటీల్లో చెలరేగిపోయేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2 మ్యాచ్ కోసం అండర్సన్‌ను తీసుకుంది ల్యాంక్‌షైర్. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మే 16, శుక్రవారం డెర్బిషైర్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో జిమ్మీ బరిలోకి దిగనున్నాడు. నిరుడు జూలైలో రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్.. ఆ తర్వాత ఇంగ్లండ్ పురుషుల జట్టు బౌలింగ్ కన్సల్టంట్గా సేవలందించాడు.
Welcome back, Jimmy 🙌
James Anderson has been named in Lancashire’s squad for their County Championship match against Derbyshire, starting tomorrow at Old Trafford pic.twitter.com/6Zy5mPHte4
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
తన సుదీర్ఘ కెరియర్లో 188 టెస్టలు ఆడిన ఈ పేసర్.. 704 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. మూడుసార్లు 10 వికెట్లు.. 32 పర్యాయాలు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఔరా అనపించాడీ పేస్ గన్. వయసు పెరుగుతున్నా కొద్దీ రాటుదేలిన అండర్సన్.. లార్డ్స్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇక్కడ ఆడిన 29 టెస్టుల్లో 123 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత జిమ్మీ ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలంలో పాల్గొన్నాడు. రూ.2 కోట్ల కనీస ధరకు పేరు నమోదు చేసుకున్న ఈ పేస్ దిగ్గజంను ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపలేదు.
ల్యాంక్‌షైర్ స్క్వాడ్ : మార్కస్ హ్యారిస్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, టామ్ బెయిలీ, జార్జ్ బాల్డర్సన్, జార్జ్ బెల్, జోష్ బొహన్నన్, టామ్ హర్ట్లే, మ్యాటీ హర్స్ట్, కీటన్ జెన్నింగ్స్, మైఖేల్ జోన్స్, అండర్సన్ ఫిలిప్, ఓలీ సట్టన్, ల్యూక్ వెల్లస్, విల్ విలియమ్స్.