భద్రాద్రి కొత్తగూడెం, మే 16 : అవగాహనతో డెంగ్యూ వ్యాధి ధరిచేరకుండా చూసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెంలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ నేతృత్వంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం “చెక్, క్లీన్ అండ్ క్లియర్” అనే థీమ్‌తో డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పౌరులు తమ ఇండ్లలో, అలాగే పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. దోమల లార్వాలను నాశనం చేయడానికి ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. నిల్వ చేసిన నీటిని ఒక మూత లేదా గుడ్డతో క్లియర్ చేయాలని లేదా కవర్ చేయాలని తెలిపారు.
ప్రోగ్రామ్ ఆఫీసర్ (మలేరియా) డాక్టర్ పి.స్పందన థీమ్‌ను అమలు చేయడంలో, స్థానిక ప్రాంతాల్లో డెంగ్యూ ప్రమాదాన్ని తగ్గించడంలో సమాజ భాగస్వామ్యం ప్రాముఖ్యతను తెలిపారు. ఈ ర్యాలీని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల (యుపీహెచ్సీ) నుండి వైద్య అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, కుమార్ స్వామి, జేతు నగేశ్, చేతన్, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.