IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణ కానుందనే సంతోషంలో ఉన్న అభిమానులకు వరుణుడు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌కు వర్షం అంతరాయం (Rain Interruption) కలిగించేలా ఉంది. గత రెండు రోజులుగా బెంగళూరులో వాతావరణం మేఘావృతమై ఉంటోంది. మ్యాచ్ రోజైన శనివారం కూడా వర్ష సూచన ఉందని సమాచారం. ఒకవేళ మ్యాచ్ సాధ్యం కాకుంటే ప్లే ఆఫ్స్ రేసుకు ఒక్క విజయం దూరంలో ఉన్న ఆర్సీబీకి నిరాశ తప్పదు.
ఐపీఎల్ కొత్త షెడ్యూల్ ప్రకటనతో ప్లే ఆఫ్స్ రేసులో బరిలో నిలిచిన ఆర్సీబీ ఉత్సాహంగా సిద్దమవుతోంది. మే 17న చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది. అయితే.. మే 15న చిన్నస్వామి మైదానం వానకు తడిసిముద్దైంది. దాంతో, గ్రౌండ్లో భారీగా నీళ్లు నిలిచాయి. వాన తెరిపినిచ్చాక ఆ జట్టు హిట్టర్ టిమ్ డేవిడ్(Tim David) ఆ వాన నీళ్లలో సరదాగా గడిపాడు.
Tim David ❌
Swim David ✅Bengaluru rain couldn’t dampen Timmy’s spirits… Super TD Sopper came out in all glory. 😂
This is Royal Challenge presents RCB Shorts. 🩳🤣#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/PrXpr8rsEa
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 16, 2025
మే 17న కూడా చినుకులు పడే అవకాశముందని వాతవారణ శాఖ చెప్పింది. ఆ రోజు ఉష్ణోగ్రత 21 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనుందని.. మధ్యాహ్నం, సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని వెల్లడించింది. దాంతో, ఇరుజట్లతో పాటు అభిమానుల్లో కలవరం మొదలైంది. కొందరేమో శనివారం టాస్ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుందిలే అని రిలాక్స్ అవుతున్నారు.
ఈ ఎడిషన్‌లో అదరగొడుతున్న బెంగళూరు జట్టు ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకవేళ శనివారం కోల్‌కతాతో మ్యాచ్ రద్దయితే.. ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. అప్పుడు ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంటుంది. అయితే.. మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌పై కచ్చితంగా గెలిచి తీరాలి. వీటిలో ఒక్కటి ఓడినా 19 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. కానీ, పంజాబ్, ఢిల్లీ, ముంబై.. ఫలితాలపై ఆర్సీబీ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.