Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ చరమగీతం పాడాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన రఫా గాయాలతో వేగలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆఖరి సారిగా దేశం తరఫున డేవిస్ కప్‌లో ఆడతానని 38 ఏండ్ల నాదల్ వెల్లడించాడు.
‘నవంబర్‌లో మలగాలో జరుగబోయే డేవిస్ కప్‌లో స్పెయిన్ తరఫున చివరిసారి ఆడుతా. నిజం చెప్పాలంటే.. గత కొన్ని ఏండ్లు చాలా కష్టంగా గడిచాయి. మరీ ముఖ్యంగా గత రెండు ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. అయితే.. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’ అని నాదల్ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు.
Mil gracias a todos
Many thanks to all
Merci beaucoup à tous
Grazie mille à tutti
谢谢大家
شكرا لكم جميعا
תודה לכולכם
Obrigado a todos
Vielen Dank euch allen
Tack alla
Хвала свима
Gràcies a tots pic.twitter.com/7yPRs7QrOi— Rafa Nadal (@RafaelNadal) October 10, 2024
స్పెయిన్ బుల్గా పేరొందిన నాదల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేశాడు. సంచలనంగా దూసుకొచ్చిన నాదల్ అద్భుత విజయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పదునైన సర్వీస్, బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకు పడే రఫా.. దిగ్గజాలకు షాకిస్తూ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.
అయితే.. గాయాలు వెంటాడడంతో కొన్నిరోజులు టెన్నిస్‌కు దూరమయ్యాడు. తొడకండరాల గాయం అతడిని మాటిమాటికీ ఇబ్బంది పెట్టింది. అయినా గోడకు కొట్టిన బంతిలా కోర్టులో అడుగపెట్టడం తనకేమీ కొత్త కాదని నిరూపిస్తూ రాకెట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయం కారణంగా ఆటకు దూరమైన.. ఇక ఎంతోకాలం ఆడలేనని భావించాడు. అయినా సరే కోలుకున్నాక మళ్లీ రాకెట్ అందుకున్నా విజేతగా నిలవలేకపోయాడు.
తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ నాదల్కు జకోవిచ్ చెక్ పెట్టాడు. అంతే.. స్పెయిన్ బుల్ ఇక రిటైర్మెంట్ తీసుకోవల్సిన సమయం వచ్చేసిందని డిసైడ్ అయ్యాడు. తన ఆటతో ఎందరినో అలరించిన నాదల్ ఆటకు ఇక సెలవంటూ తన సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేశాడు.