Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణించిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణంపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరు (business empire)..? అన్నదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చజరుగుతోంది.
రతన్ టాటా అవివాహితుడు కావడంతో ఆయనకు సొంత పిల్లలు లేరు. దీంతో రతన్ టాటా వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, రతన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆయన సవతి సోదరుడి పిల్లలు వారసులవరుతారని తెలుస్తోంది. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1940లో వీరు విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా.. సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. అతని కుమారుల్లో ఒకరి పేరు నోయెల్ టాటా (noel tata). ఆయనకు ముగ్గురు పిల్లలు మయా టాటా (Maya Tata), నెవిల్లే టాటా, లీ టాటా ఉన్నారు.
ఈ ముగ్గురిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాత్రం మయా టాటా. టాటాల వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెనూ ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 ఏండ్ల మాయా టాటా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బేయర్స్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో మయా ఉన్నత విద్య అభ్యసించారు. ఇక ఆమె తల్లి అలూ మిస్త్రీ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తోబుట్టువు. అలా తల్లివైపు నుంచి కూడా మయాకు ఘనమైన వ్యాపార వారసత్వమే ఉందన్నమాట.
వృత్తిపరంగా మయా ప్రయాణం టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో మొదలైంది.తర్వాత టాటా డిజిటల్‌కు మారారు. ఈ క్రమంలో టాటా న్యూ యాప్ రూపకల్పనలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఇందులో భాగంగా 2011లో రతన్ టాటా కోల్‌కతాలో ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆమె పర్యవేక్షిస్తున్నారు.
మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నాడు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. జుడియో, వెస్ట్‌సైడ్ బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇక మయా టాటా సోదరి లీ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్‌లలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు.
Also Read..
Ratan Tata | ఆర్కిటెక్ట్ కావాలనుకున్నారు.. చివరికి టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్