Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మృతిపట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో రతన్ టాటాకు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడు (Shantanu Naidu).. తన స్నేహితుడి (రతన్ టాటా) మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్’ (Goodbye my dear lighthouse) అంటూ వీడ్కోలు పలికారు.
మీ మరణంతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. మీరు లేని లోటును అధిగమించేందుకు ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్ బై.. మై డియర్ లైట్‌హౌస్’ అంటూ శంతను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు 30 ఏళ్ల శంతను. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
80 ఏళ్ల రతన్ టాటాకు.. ఈ శంతనుతో మంచి అనుబంధం ఏర్పడింది. 2018 నుంచి రతన్ టాటాకు శంతను అసిస్టెంట్‌గా ఉంటున్నారు. వీరిద్దరినీ కలిపింది వీధి శునకాలే. రతన్ టాటా, శంతను మధ్య భారీగా వయోబేధం ఉన్నా.. అది స్నేహానికి, వ్యాపారానికి ఏమాత్రం అడ్డుకోలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నవారు ‘ఏజ్.. జస్ట్ ఎ నంబర్’ అని తేల్చేస్తారు.
వ్యాపారంతోపాటు సామాజిక సేవలోనూ పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటాది. అలాంటి వ్యాపార దిగ్గజం భుజంపై చేయి వేసి ‘ఇంకేంటి డ్యూడ్! ట్విటర్లో ఏం ట్వీటావు? ఇన్‌స్టాలో ఫాలోవర్స్ సంగతేంటి?’ అంటూ ఆప్యాయంగా పలకరించేంత చనువు, స్నేహం శంతనుకు మాత్రమే ఉంది. రతన్ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ మీడియా ఖాతాల వెనుక ఈ 30 ఏండ్ల యువకుడి ప్రతిభా నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టే, టాటా పితామహుడి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఛైర్మన్ ఆఫీస్)గా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శంతను.
వయోభేదం లేని స్నేహం
మూగజీవాల సంరక్షణతో మొదలైన ఇద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకునేవారు. ఇదే సమయంలో రతన్ టాటాకు సోషల్ మీడియాను పరిచయం చేసింది శంతనుబాబే. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, హ్యాష్ ట్యాగ్, ఎమోజీలు వాడటం.. సామాజిక మాధ్యమాలను మెరుగ్గా వినియోగించడంలో ఉండే మెలకువలన్నీ రతన్‌కు నేర్పించాడు నాయుడు. దానితోపాటుగా వ్యాపార నిర్వహణకు సంబంధించి రతన్‌కు ఎన్నో విలువైన సలహాలు కూడా అందిస్తూ నమ్మకంగా ఉంటున్నాడు.
రతన్ టాటా, శంతను మధ్య భారీగా వయోబేధం ఉన్నా.. అది స్నేహానికి, వ్యాపారానికి ఏమాత్రం అడ్డుకాలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఏర్పడింది. మెటోపాస్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటూనే, పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు శంతను. ఆ కుర్రాడు చదువుకుంటున్న కార్నెల్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలకు రతన్ టాటా కూడా హాజరయ్యారు. ఇండియాకు వచ్చిన తర్వాత రతన్ ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు.
‘వయసులో చిన్నవాడే అయినా ఆలోచనా ధోరణిలో మాత్రం శంతను పెద్దవాడే’ అంటూ రతన్ టాటా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. కరోనా కాలంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు రతన్ టాటా. ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షించాడు శంతను.
అప్పుడేం జరిగిందంటే..
ఒకరోజు, ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ.. ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కండ్లారా చూశాడు శంతను. ఆ సంఘటన ఎంతగానో కలచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్‌లను రూపొందించాడు. ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదికి వెళ్లినప్పుడు.. బెల్టులోని రంగులు వాహనాల హెడ్‌లైట్స్‌కు మెరిసి పోతాయి. దీంతో వాహనదారులు నెమ్మది కావడమో, బండిని ఆపేయడమో చేస్తారు. ఫలితంగా, ఆ మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరగదు. చాలామంది అలాంటి బెల్టులు కావాలన్నారు.
అయితే, శంతను దగ్గర వాటి తయారీకి డబ్బు లేదు. తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్‌కు లేఖ రాశాడు. ముంబైకి రమ్మంటూ వాళ్లు ఆహ్వానం పంపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అలా శంతను ‘మోటోపాస్’ అన్న స్టార్టప్‌ను మొదలెట్టాడు. ఔత్సాహిక ఆంత్రపెన్యూర్స్ కోసం ‘ఆన్ యువర్ స్పార్క్స్’ అనే కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం ‘గుడ్‌ఫెలోస్’ అనే స్టార్టప్‌ను నిర్వహిస్తున్నాడు శంతను నాయుడు.
Also Read..
Ratan Tata | రతన్ టాటాకు ఆ కారు చాలా ప్రత్యేకం.. అదేంటంటే..?
Ratan Tata | నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..