Ratan Tata | రతన్ టాటా (Ratan Tata).. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. వ్యాపారవేత్తగానే కాదు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మరణం పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాపార దిగ్గజం గురించి ఆసక్తికర విషయాలు (interesting facts) మీకోసం..
రతన్ టాటా 1937, డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు. రతన్ టాటా ఇప్పటికీ అవివాహితుడు. నాలుగు సార్లు పెళ్లి దాకా వచ్చారు కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాలేదు. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయితో ప్రేమలో పడ్డాను అని టాటా చెప్పారు. 1962 ఇండో – చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఇండియాకు పంపించేందుకు అంగీకరించలేదు. అలా లవ్ మ్యారేజ్‌కు బ్రేక్ పడిందని తెలిపారు.
8వ తరగతి వరకు ముంబైలోని కాంపియన్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో, శిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లోనూ చదివారు.1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ పూర్తిచేశారు.
తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎంప్రెస్ మిల్స్‌కు మారారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ అయ్యారు. రెండేండ్లు తిరిగే సరికి 1983లో సాల్ట్(ఉప్పు) ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తొలిసారిగా అయోడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టారు. టాటా నామక్ – దేశ్ కా నామక్ ప్రచారంతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు. మళ్లీ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు. రతన్ టాటా 2009లో రతన్ టాటా సామాన్యుల కోసం రూ. లక్షకే నానో పేరుతో చీపెస్ట్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఇక వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం పలు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదనాం చేసింది. 2000 ఏడాదిలో రతన్ టాటాకు కేంద్రం పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇక రతన్ టాటాకు ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథంతో అసాధారణ అంకిత భావం ప్రదర్శించిన వారికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట స్మారక పురస్కారం అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో రతన్ టాటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఉద్యోగ రత్న అవార్డు..
రతన్ టాటా.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ రత్న అవార్డును కూడా అందుకున్నారు. గతేడాది ఆగస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ రతన్ టాటా నివాసంలో ఉద్యోగ రత్న అవార్డుతో ఆయన్ని సత్కరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘ఉద్యోగ రత్న’ అవార్డును తీసుకువచ్చింది. విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించింది.
రూ.వేల కోట్ల విరాళాలు
రతన్ టాటా సేవా గుణంలో అత్యున్నతుడు. వేల కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్టుల కింద వ్యక్తిగత స్థాయిలో రూ.లక్షల విరాళాలు అందించారు. ఆరోగ్య రక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు భారీగా విరాళాలు అందించారు. పెంపుడు జంతువుల కోసం రూ.165 కోట్ల వ్యయంతో టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ నిర్మించారు. 1970లలోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆయన టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు.
Also Read..
Ratan Tata | లెజెండ్స్‌కు మరణం ఉండదు.. రతన్ టాటాకు వ్యాపార దిగ్గజాల సంతాపం
Ratan Tata | సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా అంత్యక్రియలు..
Ratan Tata | దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖుల నివాళి