హైదరాబాద్ : నాడు కేసీఆర్ ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ఎప్పుడు లేనంతగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. మెడికల్ కాజీల ఏర్పాతో ఎంతో మంది పేద పిల్లలు వైద్య విద్యకు నోచుకొని ఉన్నతంగా ఎదుగుతున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలు మన కండ్లముందే కనిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో(Siddipet district) ఒకే ఇంట్లో నలుగురికి(Four sisters) ఎంబీబీఎస్ సీట్లు రావడం అనేది నాటి ప్రభుత్వం వైద్య విద్యకు అందించిన ప్రోత్సాహమే కారణమని పలువురు చర్చించుకోవడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే..సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో(Govt Medical colleges) ఎంబీబీఎస్ సీట్లు(MBBS seats)పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వగా..రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొంది చదువుతున్నది.ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారని, జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చినందుకు ఇది సాధ్యమైందని తండ్రి రామచంద్రం తెలిపాడు.
కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్ చదువుతున్నారని, ప్రత్యేక తెలంగాణ వల్లే ఇది సాధ్యమైందని సంతోషంగా తెలిపారు. ఈ మేరకు రామచంద్రం తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. నలుగురు ఎంబీబీఎస్ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని హరీశ్ రావు పిల్లలను అభినందించాడు.