PT Usha : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. తనది నియంతృత్వ ధోరణి అంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖ రాసిన 12 బంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులపై ఆమె మండిపడింది. వాళ్లు తనపై చేస్తున్నవి ఉత్త ఆరోపణలే అని, అందుకు ఆధారాలు లేవని ఉష తెలిపింది. అంతేకాదు ఎగ్జిక్యూటివ్ సభ్యుల్లో కొందరు అవినీతికి పాల్పడ్డారని, లింగ వివక్ష చూపించారని, వాళ్లలో కొందరిపై లైంగిక వేధింపుల కేసులు కూడా నమోదు అయ్యాయని ఉష వెల్లడించింది.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈవోగా రఘురామ్ అయ్యర్ (Raghuram Iyer) నియామకంపై భిన్న వాదనల నేపథ్యంలో ఉష తీరును సభ్యులు తప్పు పట్టారు. ఆమెది నిరంకుశ ధోరణి, నియంతృత్వ పోకడ అంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జెరొమె పొయివేకు 12 మంది సభ్యులు లేఖ రాశారు. అయితే.. వాళ్లు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పీటీ ఉష అంటోంది. సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎన్నికపై తాము రెండు సార్లు సమావేశం అయ్యామని.. అయితే రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ఆమె అంది.
🚨 Press Release. pic.twitter.com/CRxir0O09P
— P.T. USHA (@PTUshaOfficial) September 29, 2024
అంతేకాదు ఆ మీటింగ్స్‌ను ఉద్దేశపూర్వకంగానే బోర్డు సభ్యులు రికార్డ్ చేయలేదని ఉష ఆరోపిస్తోంది. ‘నా 45 ఏండ్ల క్రీడా జీవితంలో ఎన్నో అంతర్జాతీయ వేదికలపై, ఎన్నో పోటీల్లో భారత దేశ ప్రతినిధిగా వ్యవహరించాను. అయితే.. మన అథ్లెట్లు, మన దేశ క్రీడా భవిష్యత్తు గురించి కాకుండా ఇతర విషయాలు మాట్లాడేవాళ్లను నేనెప్పుడు కలవలేదు’ అని ఉష ఈసీ సభ్యుల తీరును దుయ్యబట్టింది.
పారిస్ ఒలింపిక్స్ సమయంలోనూ ఉష తీరుపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)ను ఆస్పత్రిలో పరామర్శించిన ఆమె ఆ తర్వాత.. ‘బరువు అనేది క్రీడాకారుల బాధ్యత’ అంటూ కామెంట్ చేసింది. దాంతో, ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకు వినేశ్ సైతం గట్టిగానే బదులిచ్చింది. తనతో బలవంతంగా ఓ ఫొటో దిగి.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రాజకీయం చేశారని మాజీ రెజ్లర్ ఉషను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చింది.