PR Sreejesh : భారత పురుషుల హాకీ జట్టు గోల్ కోపర్ పీఆర్ శ్రీజేష్(PR Sreejesh ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) తర్వాత హాకీకి వీడ్కోలు పలుకనున్నట్టు సోమవారం శ్రీజేష్ వెల్లడించాడు. గోల్ కీపర్‌గా టీమిండియా విజయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న అతడు సోషల్ మీడియా వేదికగా తన వీడ్కోలు వార్తను అందరితో పంచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మురిసిపోయిన శ్రీజేష్ ప్యారిస్‌లోనూ మెడల్ గెలవాలనే కసితో ఉన్నాడు.
‘అంతర్జాతీయ హాకీలో ఆఖరి టోర్నీ ఆడుతున్నవేళ నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇన్నేండ్లుగా నాపై ప్రేమ కురిపించి, నాకు మద్దతుగా నిలిచిన కుటుంబసభ్యులు, జట్టు సభ్యులు, కోచ్‌లు, అభిమానులు.. అందరికీ ధన్యవాదాలు’ అని శ్రీజేష్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
As I stand on the threshold of my final chapter in international hockey, my heart swells with gratitude and reflection. This journey has been nothing short of extraordinary, and I am forever grateful for the love and support from my family, teammates, coaches, and fans. pic.twitter.com/MqxIuTalCY
— sreejesh p r (@16Sreejesh) July 22, 2024

ప్రపంచస్థాయి గోల్‌కీపర్‌గా ఎదిగిన శ్రీజేష్ కేరళలోని ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా సరే హాకీ ఆడాలనే కల కన్నాడు. అలా 2006లో హాకీలో అరంగేట్రం చేసిన శ్రీజేష్ తన 18 ఏండ్ల కెరీర్లో భారత జట్టు ఎన్నో చిరస్మణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన అతడు.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో శ్రీజేష్ కల నిజం చేసుకున్నాడు.

రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా శ్రీజేష్ తన తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. మా నాన్న ఆవును అమ్మేసి నాకు మొదటి హాకీ కిట్ కొనిచ్చాడు. ఆ విషయాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. ఆయన త్యాగం నాలో విజయ కాంక్షను రగిల్చింది. కష్టాలను అధిగమించడం, పెద్ద కలలు కనడం నేర్పించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో నా కల నెరవేరింది. ఆక్షణం మేము చేసుకున్న సంబురాలు.. అందరం కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నాకు ఎంతో విలువైనవి అని శ్రీజేష్ తెలిపాడు.