PCB : పొట్టి వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ (Pakistan) జట్టుకు మరో షాకింగ్ న్యూస్. న్యూయార్క్‌లో భారత్(Team India) చేతిలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ సేనపనై ఆ దేశ బోర్డు (PCB) కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీమిండియాపై అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడడంపై మండిపోతున్న పీసీబీ ఆటగాళ్ల జీతాలు కట్ చేసేందుకు సిద్దమైంది.
అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్(Central Contract)లోనూ భారీ మార్పులు చేసేందుకు పూనుకుంటోంది. అమెరికా చేతిలో ఓటమి తర్వాత పాక్ జట్టుకు చిన్న సర్జరీ అవసరం అని చెప్పిన పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi).. భారత్‌పై పాక్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. బాబర్ బృందానికి పెద్ద ఆపరేషనే చేయాలని మ్యాచ్ అనంతరం అతడు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా పాక్ ఆటగాళ్లు భారీగానే ఆర్జిస్తున్నారు. ఎవరెవరికి ఎంత వస్తుందంటే..? గ్రేడ్ -ఏలో ఉన్న బాబర్ ఆజాం (Babar Azam), రిజ్వాన్, పేసర్ షాహీన్ ఆఫ్రిదిలు నెలకు రూ.13.53 లక్షలు సంపాదిస్తున్నారు. గ్రేడ్ – బిలో ఉన్న షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రవుఫ్, నసీం షా (Naseem Shah)లకు పీసీబీ నెల నెల రూ.9 లక్షలు ముట్టజెప్పుతోంది. ఇక గ్రూప్ సీ, గ్రూప్ డిలోని ఆటగాళ్లకు రూ.2.25 లక్షల నుంచి రూ.4.5 లక్షలు అందుతున్నాయి.
చిరకాల ప్రత్యర్థి భారత్‌పై అందివచ్చిన విజయాన్ని బాబర్ సేన చేజేతులా వదిలేసింది. బుమ్రా(3/14), పాండ్యా (2/24)ల విజృంభణతో స్వల్ప ఛేదనలో చతికిలబడి తన పరాజయాల పరంపరను కొనసాగించింది. సూపర్ 8 ఆశలు మిణుకుమిణుకు మంటున్న వేళ కెనడా, ఐర్లాండ్ మ్యాచ్‌పై పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఆ పోరు కాస్త వాన కారణంగా రద్దు కావడంతో అమెరికా సూపర్ 8కు వెళ్లగా.. పాకిస్థాన్ ఎలిమినేట్ అయింది. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో బాబర్ బృందం జూన్ 16 ఆదివారం నాడు ఐర్లాండ్‌తో తలపడనుంది.