IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. సరహద్దు వివాదాల కారణంగా స్తంభించిన క్రికెట్ సంబంధాలు ఇంకా మెరుగుపడలేదు. అప్పటినుంచి పాకిస్థాన్ పర్యటనకు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ(BCCI) సిద్ధంగా లేదు. వచ్చే ఏడాది పాక్ గడ్డ మీద జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో సైతం భారత జట్టు ఆడడంపై సందిగ్ధం నెలకొంది.
ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. పీసీబీ అధికారులు మాత్రం అవన్నీ తప్పుడు కథనాలు అని కొట్టిపారేశారు.

టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలనే ఆలోచనే మాకు లేదు. చాంపియన్స్ ట్రోఫీని సజావుగా జరపడమే ప్రస్తుతం మా ముందున్న పెద్ద చాలెంజ్. ఇదే మాకు అతిపెద్ద అజెండా. అంతేకాదు ఈ ఏడాది మా జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మస్త్ బిజీగా ఉంది. కాబట్టి. భారత జట్టుతో టీ20 సిరీస్ అనేది అసత్య కథనం అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఒకవేళ భారత జట్టు ఈ టోర్నీలో ఆడకుంటే టీ20 వరల్డ్ కప్ 2026నుంచి వైదొలగాలని పీసీబీ భావిస్తోంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని పాక్ బోర్డు అనుకుంటోంది.