Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భారత జట్టు ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భద్రత కారణాల దృష్ట్యా దాయాది దేశానికి ఆటగాళ్లను పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సుముఖంగా లేదు. చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాక్‌కు పంపాలా? వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) సైతం చెప్పేశాడు. అయితే.. అందుకు విరుద్దంగా పాకిస్థాన్ మాత్రం భారత్ మాత్రం కచ్చితంగా తమ దేశం వస్తుందని, చాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని ధీమాతో ఉంది.
సోమవారం ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) సైతం భారత జట్టు మెగా టోర్నీలో ఆడడం పక్కా అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టు తప్పకుండా రావాలి. టీమిండియా పాక్ పర్యటనను రద్దు చేసుకుంటుందనిగానీ లేదా వాయదా వేసుకుంటుందనిగానీ నేను అనుకోవడం లేదు. పాక్ గడ్డ మీద అన్ని జట్లతో చాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తామని మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇక షెడ్యూల్ సమయానికి మ్యాచ్‌ల నిర్వహణకు స్టేడియాలు సిద్దమతాయి. ఒకవేళ ఎక్కడైనా పనులు పూర్తి కాకుంటే టోర్నీ తర్వాత వాటి మీద దృష్టి పెడుతాం’ అని పీసీబీ చీఫ్ నఖ్వీ తెలిపాడు.
PCB chair Mohsin Naqvi is confident India will visit Pakistan for next year’s Champions Trophy
👉 https://t.co/XTq81kuuLf pic.twitter.com/4w6I9f7Xk1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2024
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగనుంది. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పీసీబీ ఇప్పటికే కొత్త స్టేడియాల నిర్మాణం, పాత వాటికి మరమ్మతుల పనులను శరవేగంగా చేపడుతోంది. కానీ, బీసీసీఐ మాత్రం భారత జట్టును పాక్‌కు పంపేందుకు సిద్ధంగా లేదు. అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని కాన్పూర్ టెస్టు సందర్భంగా రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
BCCI Vice President Rajeev Shukla on Bilateral Series against Pakistan pic.twitter.com/tfTaYc9WJb
— RVCJ Media (@RVCJ_FB) September 15, 2023
‘చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నిర్వహించనుంది. అయితే.. నిరుడు ఆసియా కప్ కూడా ఆ దేశంలోనే జరగాల్సింది. కానీ, బీసీసీఐ డిమాండ్‌తో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని జరిపారు. ప్రస్తుతానికైతే పాకిస్థాన్‌కు జట్టును పంపాలా? వద్దా? అనే విషయం చర్చకు రాలేదు. ఆ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము పాటిస్తాం’ అని శుక్లా తెలిపాడు.
సరిహద్దు వివాదాల కారణంగా 2013 తర్వాత భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. పాక్‌కు టీమిండియా వెళ్లలేదు. అయితే.. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరిగినా సరే నిరుడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు బాబర్ ఆజాం నేతృత్వంలోని పాక్ జట్టు భారత్‌కు వచ్చింది. దాంతో.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది గడ్డపై అడుగుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.