Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటకు రాలేదు. వరుసగా ఆరో సెషన్లో సోమవారం ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభంలో లాభాలు గడించినా.. అన్ని సెక్టార్ల షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 638.45 (0.78 శాతం) పాయింట్లు నష్టపోయి 81,050 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరో వైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 218.85 (0.89 శాతం) పాయింట్లు నష్టపోయి 24,795.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ-50 లో 50 స్టాక్స్‌కు 40 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర స్టాక్స్ 4.29 శాతం వరకూ నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 2.01 శాతం, స్మాల్ క్యాప్ 2.75 శాతం నష్టాలతో ముగిశాయి. ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ తదితర పది స్టాక్స్ 1.86 శాతం వరకూ లాభ పడ్డాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో 30 స్టాక్స్‌కు 23 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర స్టాక్స్ పతనం అయ్యాయి. మరోవైపు ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్సులు నష్టాలతో స్థిర పడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు, మీడియా ఇండెక్సులు మూడు శాతం పై చిలుకు చొప్పున దారుణంగా నష్టపోయాయి. కేంద్ర చమురు సంస్థలు, మెటల్ ఇండెక్స్ రెండు శాతానికి పైగా, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒక శాతానికి పైగా నష్టపోయాయి.