IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌కు బోలెడంత సమయం ఉంది. కానీ, మెగా వేలానికి కొన్నిరోజులే ఉన్నాయి. ఆ లోపే కోచింగ్ సిబ్బందిని పటిష్టం చేసుకుంటున్నాయి పలు ఫ్రాంచైజీలు. ఐపీఎల్లో అనభవం గల మాజీ ఆటగాళ్లకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అందులో భాగంగానే భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (Parthiv Patel) కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇన్నిరోజులు టాలెంట్ స్కౌట్‌గా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు సేవలందించిన పార్థీవ్ ఇక కొత్త జట్టుకు మారున్నాడు. మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు బ్యాటింగ్ మెంటర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.
ఈ విషయమై ఇప్పటికే అతడితో గుజరాత్ ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ అశిష్ నెహ్రా (Ashish Nehra), డైరెర్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీలతో కలిసి పార్థీవ్ పని చేయనున్నాడు.
Parthiv Patel set to join Gujarat Titans as mentor. (Sahil Malhotra/TOI). pic.twitter.com/V03iskqdvJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2024
ఐపీఎల్ అరంగేట్రంలోనే కప్ కొట్టిన గుజరాత్ మరుసటి ఏడాదీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలిసారి కప్ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) మరోసారి తన మ్యాజిక్ చేసినా జట్టుకు ట్రోఫీ మాత్రం దక్కలేదు. అంతలోనే ముంబై ఇండియన్స్ అతడిని కొనేసి.. కెప్టెన్సీ అప్పగించింది. ఆ పరిస్థితుల్లో గుజరాత్‌కు యువకెరటం శుభ్‌మన్ గిల్ పెద్ద దిక్కయ్యాడు.
కెప్టెన్‌గా అనుభవం లేని గిల్ సారథ్యంలో గుజరాత్ 17వ సీజన్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం.. ప్రధాన ఆటగాళ్లు సాహా, మిల్లర్, విజయ్ శంకర్లు విఫలమవ్వడం.. కెప్టెన్‌గా గిల్‌పై భారం పడడం.. ఇవన్నీ కలిసి గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బ తీశాయి. దాంతో, 18 వ సీజన్లో ట్రోఫీ లక్ష్యంగా గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్టే కోచింగ్ టీమ్‌ను బలోపేతం చేసుకుంటోంది.