Hyundai | దేశీయ స్టాక్ మార్కెట్లలో హ్యుండాయ్ మోటార్ ఇండియా మంగళవారం లిస్టయింది. అయితే ఇష్యూ ధర కంటే ఎన్ఎస్ఈలో ఆరు శాతం నష్టంతో ట్రేడయింది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా షేర్ ఐపీఓలో రూ.1960గా నిర్ణయించగా, మంగళవారం రూ.1844.65 వద్ద ట్రేడయింది. హ్యుండాయ్ మోటార్ ఇండియాలో హ్యుండాయ్ మోటార్ కార్పొరేషన్ తన 17.5 శాతం వాటాను విక్రయించింది.
మంగళవారం స్టాక్ ధర రూ.1,934 వద్ద ట్రేడయింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి హ్యుండాయ్ మోటార్ షేర్ విలువ 7.1 శాతం నష్టంతో రూ.1820.40 వద్ద సెటిలైంది. బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్ లో స్వల్పంగా రూ.1968.80 లకు పెరిగి, రూ.1,807.05లతో కనిష్టానికి పడిపోయింది. 330 కోట్ల డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓకు వెళ్లింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.