BCCI : టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడైన గౌతం గంభీర్ (Gautam Gambhir) కొత్త సహాయక సిబ్బంది వేటలో నిమగ్నమయ్యాడు. ఐపీఎల్లో తనతో కలిసి ఆడిన, కలిసి పనిచేసిన వాళ్లను కోచింగ్ స్టాఫ్‌గా తీసుకునేందుకు వ్యూహం రచిస్తున్నాడు. అయితే.. గౌతీ యవ్వారం మాత్రం బీసీసీఐ (BCCI)కి రుచించడం లేదు. తాజాగా భారత క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు జతిన్ పరంజపే (Jatin Paranjape) గంభీర్‌పై మండిపడ్డాడు. కోచ్‌గా వస్తూనే పాత సిబ్బందిని మార్చేయడం అర్థ రహితమని ఆయన అన్నాడు.
‘కొత్త కోచ్‌లు తమ టీమ్‌ను తీసుకోవడం ఫుట్‌బాల్ ఆటలో ఆనవాయితీ. ఇప్పుడు అదే సంస్కృతి క్రికెట్‌కు కూడా పాకింది. భారత జట్టు సహాయక సిబ్బంది మొత్తాన్ని హెడ్ కోచ్ గంభీర్ ఎందుకు మార్చేయాలి అనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఏం తప్పు చేశారు? వాళ్లను ఎందుకు తొలగించాలి?’ అని జతిన్ ప్రశ్నించాడు.

అంతేకాదు రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని సహాయక బృందం టీమిండియా అద్భుత విజయాల్లో భాగమైంది. వాళ్ల హయాంలోనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)ఫైనల్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది అనే విషయాన్ని జతిన్ గుర్తు చేశాడు. గంభీర్‌ను భారత జట్టు కోచ్‌గా ఎంపిక చేసిన క్రికెట్ సలహా మండలి సభ్యులలో ఒకరైన పరంజపే వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజుతో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, సహాయక బృందం కాంట్రాక్ట్ ముగిసింది. దాంతో, భారత హెడ్‌కోచ్‌గా ఎంపికైన గంభీర్ తనకంటూ సొంత టీమ్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ సహచరులు అభిషేక్ నాయర్, వినయ్ కుమార్, డాస్చెట్, మోర్నీ మోర్కెల్‌లను సహాయక సిబ్బందిగా కావాలని బీసీసీఐకి తేల్చి చెప్పాడు.
గంభీర్, అభిషేక్ నాయర్

అయితే.. బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్ బదులు మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను తీసుకోవాలని జై షా బృందం భావిస్తోంది. దాంతో, కొత్త సిబ్బంది ఖరారు ఆలస్యమవుతోంది. జూలై 26న శ్రీలంక సిరీస్ ఆరంభం కానుంది. ఆలోపు టీమిండియా కోచింగ్ స్టాఫ్‌ను బీసీసీఐని ప్రకటించే అవకాశముంది.