Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలికిన తర్వాత అభిమానులను అలరించే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. కానీ, ఈ ప్రశ్నకు ‘నేనున్నాగా’ అంటూ సమాధానమిస్తున్నాడు రిషభ్ పంత్ (Rishabh Pant). సుదీర్ఘ ఫార్మాట్లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగే ఈ వికెట్ కీపర్.. తనదైన విన్యాసాలతో ఫ్యాన్స్‌ను నవ్విస్తుంటాడు. క్రీజులో ఉన్నంత సేపు స్వీప్ షాట్లతో, ఒంటి చేతి సిక్సర్లతో ఆకట్టుకునే పంత్.. లార్డ్స్ టెస్టులోనూ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఈసారి అతడు గాయం తాలుకు నొప్పిని పంటిబిగువున భరిస్తూనే అభిమానులను రంజింపజేశాడు.
మూడో రోజు తొలి సెషన్లో చకచకా వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లోని నెట్టాలనుకున్న ఇంగ్లండ్ వ్యూహాన్ని పంత్, రాహుల్ ఫలించనీయలేదు. క్రీజులో పాతుకుపోయిన రాహుల్‌కు జోడీగా వైస్ కెప్టెన్ ఆడిన ఇన్నింగ్స్ ఆద్యంతం కనులవిందుగా సాగింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత గేర్ మార్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ కేఎల్ రాహుల్(98 నాటౌట్)తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లు సంధించిన షార్ట్ పిచ్ బంతుల్ని దీటుగా ఎదుర్కొన్న పంత్.. ఎడమ చేతి చూపుడు వేలి గాయం నొప్పిని బయటకు కనిపించనీయలేదు. రాహుల్‌తో కలిసి 154 బంతుల్లో 100 రన్స్ రాబట్టి స్కోర్ 200 దాటించాడీ పవర్ హిట్టర్.
రిషభ్ పంత్ (74)
అయితే.. స్టోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పెద్ద షాట్ ఆడబోగా.. బంతి గాయం తగిలిన చోటనే తాకి ఇబ్బంది పడ్డాడు పంత్. ఫిజియో పరీక్షించి వెళ్లాక.. చివరి బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపి 86 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ హిట్టర్. తద్వారా ఇంగ్లండ్‌పై 8 సార్లు ఫిఫ్టీ ప్లస్ రన్స్ కొట్టిన రెండో భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడికంటే ముందు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ ఫీట్ సాధించాడు.
హాఫ్ సెంచరీ తర్వాత బషీర్ ఓవర్లో సిక్సర్‌తో రెచ్చిపోయిన పంత్.. లంచ్‌కు ముందు అనూహ్యంగా సింగిల్ తీయబోయి స్టోక్స్ త్రోకు బలయ్యాడు. అప్పటిదాకా తనవైన షాట్లతో భారత ఫ్యాన్స్‌కు థ్రిల్ పంచిన పంత్.. నిరాశగా డగౌట్ చేరాడు. దాంతో నాలుగో వికెట్ 141 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా సరే లార్డ్స్ మైదానంలో అతడు చేసిన 74 పరుగులు సెంచరీ కన్నా విలువైనవి అంటున్నారు విశ్లేషకులు.