Balkampeta Yellamma Temple | అమీర్‌పేట్, జూలై 12 : అసలేం జరుగుతోంది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో.. అనే సందేహం భక్తుల్లో నెలకొంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం తెలంగాణ ఆవిర్భావం తరువాత గత దశాబ్ద కాలంలో విశేష ప్రగతి సాధించింది. తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మునుపటి రోజులతో పోల్చలేనంతగా ప్రగతి బాట పట్టింది. అప్పటి మంత్రి తలసాని దేవాలయానికి ఇరువైపులా నిర్మించ తలపెట్టిన భారీ షెడ్ల నిర్మాణాలకు దాతలు ఉదారంగా తమ వంతు చేయూతనందించారు. ఈ షెడ్ల నిర్మాణాలతో ఆలయ పరిసరాల్లో సేదదీరే భక్తులకు ఎండ, వానల నుండి ఎంతో ఉపశమనం కలిగింది.
అమ్మవారి కల్యాణోత్సవం, బోనాలు, దసరా నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తుండడంతో దేవాలయానికి భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరిగింది. ఆషాడ మాసం వచ్చిందంటే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఆషాడ మాసం ఆది, మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దాదాపు 35 వేల నుండి ఒక లక్షకు చేరుతుంది. ఇక హుండీల లెక్కింపు ద్వారా వార్షికాదాయం దాదాపు నాలుగు కోట్లకు పై మాటే. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కలిపితే, మొత్తం వార్షికాదాయం రూ. 7 కోట్లకు పై మాటేనని తెలుస్తోంది.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దేవాలయ నిర్వహణ ఇప్పుడు గాలిలో దీపంలా మారింది. గ్రేటర్ పరిధిలో నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న దేవాదాయ శాఖకు చెందిన 3 (ఏ) (2) స్థాయి దేవాలయమైన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం అతి పెద్ద లోటు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులకు లోటు లేదు. అంతే స్థాయిలో అమ్మవారి హుండీ ఆదాయంతోపాటు వివిధ పధ్ధతుల్లో విరాళాలు, అమ్మవారికి బంగారు నగలు, ఖరీదైన పట్టు చీరలను భక్తులు సమర్థిస్తుంటారు.
ఇటీవలి కాలంలో ఫిలయన్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబాని, ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి తన వంతు చేయూతగా రూ.కోటి విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నిర్వహణ ఇప్పుడు గాలిలో దీపంలా మారింది.
ఈవో, సూపరింటెండెంట్ మధ్య కోల్డ్ వార్..
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం గత రెండేళ్లుగా ఇంఛార్జ్ పాలనలో కొనసాగుతుండడం గమనార్హం. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయంలో భక్తులకు ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, పండుగల నిర్వహణ, టెండర్ల ప్రకటన వంటి కీలకమైన పరిపాలనా పరమైన అంశాలను ఇన్ఛార్జ్ ఈవోలు నిర్వహించలేకపోతున్నారు. దేవాలయ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నా వారిపై స్థానికుల నుండి వత్తిడి మొదలు, అటెండర్ స్థాయి నుండి సూపరింటెండెంట్ వరకు ఎవరికి వారే గ్రూపులు కట్టి తమదైన సమాంతర వ్యవస్థలను నిర్వహిస్తుండడంతో ఆలయంలో ఆధాత్మిక శోభ నానాటికీ తగ్గుముఖం పడుతోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా..
ముఖ్యంగా దేవాలయ నిర్వహణలో ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది నిర్వాకాలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. దేవాలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను స్థానికులు కొందరు నేరుగా దేవాదాయ శాఖ మంత్రికి రిజిష్టర్ పోస్టులు పంపే వరకు పరిస్థితులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో దేవాలయ ఇన్ఛార్జ్ ఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మహేందర్ గౌడ్ సీనియర్ అధికారిగా, అందరి సహకారంతో ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విజయం సాధించారు. అయినప్పటికీ ఈవోకు ఒకరిద్దరు ఉద్యోగులు మినహా సూపరింటెండెంట్ నుండి అర్చకుల వరకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు, ఒక రకంగా ఇక్కడ ఈవోకు ఉద్యోగులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
వరుస వివాదాలు.. కానరాని పరిష్కారాలు..
పరిపాలనా వ్యవహారాల్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం గత రెండేళ్లుగా తిరోగమన దిశకు మళ్లిందనే చెప్పాలి. గత రెండేళ్ల కాలంలో ఆలయంలో చోటు చేసుకున్న పరిణామాలు సంచలనాలకు తెరతీశాయి. ఆలయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆలయ ఆవరణలోని సంపులో పడిన ఓ వ్యక్తి దుర్మరణం చెందడం, వెలుగు చూసిన నకిలీ టిక్కెట్ల వ్యవహారం, భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన వాహనాల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ముందుకు కదలకపోవడం వంటి అంశాలు, దేవాలయ పరిపాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. కొద్ది నెలల క్రితం దేవాలయ ఆవరణలో సంపులో పడి మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన అంశంపై బాధ్యులెవరనేది ఇప్పటికీ తేలలేదు.
గతంలో వెలుగు చూసిన నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో దేవాలయంలో కీలక విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నా.. ఓ చిరుద్యోగిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకేముంది, ఈ వివాదంలో కూడా బాధ్యులను గుర్తించే దిశగా అడుగులు పడలేదు. గత మంత్రి తలసాని చొరవతో ప్రారంభమైన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఊహించని విధంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రెండేళ్లుగా ఇక్కడి అసంపూర్తి నిర్మాణాలు ఎల్లమ్మ సాక్షిగా తుప్పుబట్టిపోయాయి.
ఇక ఈ పనులు ఇప్పట్లో ముందుకు సాగవని చెప్పకనే చెబుతున్నట్టుగా, ఈ నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన ప్రహరీ గోడలను సదరు కాంట్రాక్టర్ వారం రోజుల క్రితమే తొలగించారు. దీంతో ఇప్పటి వరకు వెచ్చించిన కోట్లాది నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు నిలిచిపోవడానికి దేవాలయ, దేవాదాయ (ఇంజినీరింగ్ అధికారులు మధ్య లోపించిన సమన్వయమేనని దాతలు సైతం విమర్శిస్తున్నారు.
ఉన్నతాధికారుల అండదండలు …?
ప్రతిష్టాత్మక బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి పూర్తి స్థాయి ఈవో నియామకం జరుగకుండా దేవాలయానికే చెందిన కొన్ని శక్తులు పని చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు దేవాదాయ శాఖ చెందిన ఉన్నతాధికారుల సంపూర్ణ సహాయసహకారాలు పుష్కలంగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గతంలో మంత్రిగా తలసాని కొనసాగిన సమయంలో దేవాలయానికి సమర్ధులైన అధికారుల నియామకం జరిగింది. వీరు తమ పదవీ కాలాన్ని పూర్తిగా ఆలయ అభివృద్ధి అంశాలకే కేటాయించే వారు. అయితే మారిన పరిస్థితుల్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి పూర్తి స్థాయి ఈవోను నియమించాలనే ఆలోచన అటు ప్రభుత్వానికి గానీ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలిసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు గానీ కలగకపోతుండడం ఎల్లమ్మ దేవాలయంలో ఖచ్చితంగా గందరగోళాన్ని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి