World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్(28), లిట్టన్ దాస్(24) నిలకడగా ఆడుతున్నారు. పటిష్టమైన ఆస్ట్రేలియా పేస్ దళంపై ఎదరుదాడి చేస్తూ పరుగులు రాబడుతున్నారు. దాంతో, 10 ఓవర్లకు బంగ్లా వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో బంగ్లా ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే మొదటిసారి.
ప్రపంచ కప్ చివరి డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. పుణేలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నామమాత్రమైన ఈ పోరులో మాక్స్వెల్, మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతినిచ్చారు. వీళ్ల స్థానంలో స్మిత్, సియాన్ అబాట్ జట్టులోకి వచ్చారు. షకీబుల్ హసన్ గాయపడడంతో శాంటో బంగ్లాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సెమీస్ రేసు నుంచి ముందే తప్పుకున్న బంగ్లా టోర్నీని విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది.