Babar Azam : వన్డే వరల్డ్ కప్ పాకిస్థాన్ సమిష్టి వైఫల్యంతో సెమీస్ రేసులో వెనకబడింది. కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) పేలవ ఫామ్‌తో నిరాశపరచడం పాక్ సెమీస్ అవకాశాల్ని దెబ్బతీసింది. సారథిగా అతడు తప్పుకొని, విరాట్ కోహ్లీ(Virat Kohli)లా బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టాలనే డిమాండ్లు ఎక్కువుతున్నాయి. శనివారం ఇంగ్లండ్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ బాబర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.
‘నేను మూడేండ్లుగా పాక్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నా. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదు. గురించి నేను ఇంతకుముందే మాట్లాడాను. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత స్వదేశం వెళ్లాక ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే నేను కెప్టెన్‌గా తప్పుకోవడం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు నా ఫోకస్ ఇంగ్లండ్ మ్యాచ్ మీదే’ అని బాబర్ సమాధానమిచ్చాడు. అయితే.. కెప్టెన్‌గా కొనసాగాలా? వద్దా? అనే విషయంపై బాబర్ పాక్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజాతో పాటు సన్నిహితులతో చర్చిస్తున్నాడని సమాచారం.
పాకిస్థాన్ జట్టు
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా వరల్డ్ కప్‌లో అడుపెట్టిన బాబర్ అంచనాలు అందుకోలేకపోయాడు. ఇప్పటివరకూ 8 మ్యాచుల్లో 40 సగటుతో 282 పరుగులు చేశాడంతే. ఇక.. వరల్డ్ కప్ టోర్నీలో మెరుగైన రికార్డు కలిగిన పాక్… భారత గడ్డపై మాత్రం తేలిపోయింది. వరుస ఓటములతో నిరాశ పరిచిన బాబర్ సేన న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో అనూహ్యంగా సెమీస్ రేసులో నిలిచింది. అయితే.. కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. పైగా ఆ జట్టు రన్ రేటులో పాక్ (+0.036) కంటే ముందుంది. దాంతో, ఇంగ్లండ్‌పై గెలిచినా కూడా బాబర్ బృందం సెమీస్ చేరడం కష్టం.