ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 19:29:48

యూఎస్ ఓపెన్ జరుగుతుందో లేదో: హలెప్

యూఎస్ ఓపెన్ జరుగుతుందో లేదో: హలెప్

లండన్​: అమెరికాలోని న్యూయార్క్​లో కరోనా తీవ్ర రూపం దాలుస్తుండడంతో ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కావాల్సిన యూఎస్ ఓపెన్ కూడా జరుగుతుందో లేదో అని గతేడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్ సిమోనా హలెప్​ అభిప్రాయపడింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ రద్దు అవడాన్ని సానుకూలంగా తీసుకుంటానని శనివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. “ఆ నిర్ణయాన్ని నేను సానుకూలగా తీసుకుంటా. ఎందుకంటే రెండేండ్లు నేను డిఫెండింగ్ చాంపియన్​గానే ఉంటా కదా” అని చెప్పింది.

డబ్ల్యూటీఏ, ఏటీపీ పోటీలు జూలై వరకు నిలిచిపోవడంపై స్పందించింది. ఈ ఏడాది మొత్తం టెన్నిస్ పోటీలు రద్దయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చని హలెప్ అంచనా వేసింది. అందరూ ఇండ్లలోనే ఉంటే కరోనా వైరస్​ను అధిగమించవచ్చని తాను అనుకుంటున్నానని రొమేనియా స్టార్ హలెప్ చెప్పింది. “ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జూలైకు మించి టెన్నిస్ పోటీలు ఆగిపోవచ్చు. యూఎస్ ఓపెన్ ఉంటుందని ఆశిస్తున్నా. అయితే న్యూయార్క్ ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉండడంతో ఆ టోర్నీ జరుగుతుందో లేదో కచ్చితంగా చెప్పలేం” అని హలెప్ తెలిపింది. రాకెట్​ను ముట్టుకోకుండా ఇంత కాలం ఉండడం ఇదే తొలిసారి అని వెల్లడించింది. 


logo