Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన ఇరానీ కప్(Irani Cup 2024) వేదిక మారనుంది. భారీ వర్షాల నేపథ్యంలో మెగా టోర్నీని ముంబై బయట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దేశవాళీ క్రికెట్ 2024-25 షెడ్యూల్ ప్రకారం ఈసారి ఇరానీ కప్ ముంబైలో జరగాలి. కానీ, వర్షాకాలంలో ముంబైలో జోరు వానులు పడడం ఖాయం. ఇప్పటికే వానలతో ముంబై ప్రజలు వణికిపోతున్నారు. అందుకని అక్టోబర్ 1 నుంచి 5వ తేదీన జరగాల్సిన ఇరానీ కప్‌ను అహ్మదాబాద్‌లో లేదా లక్నోలో నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ తర్వాత ఇరానీ కప్ చాలా ఫేమస్. ఈసారి ముంబైలో టోర్నీ నిర్వహణకు వరుణుడు అడ్డు పడే అవకాశముంది. కాబట్టి.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లేదా లక్నోలోని ఏక్నాథ్ స్టేడియంలో ఇరానీ కప్ జరిపేందుకు బీసీసీఐ మొగ్గు చూపోతోంది. ఈ టోర్నీలో రంజీ చాంపియన్ ముంబై, రెస్టాఫ్ ఇండియా(Rest Of India)తో తలపడనుంది.
రంజీ ట్రోఫీతో ముంబై జట్టు
ఒకవేళ వేదిక మారితే సొంత గడ్డపై పంజా విసరాలనుకున్న ముంబైకి షాక్ తగిలినట్టే. పోయిన రంజీ ట్రోఫీలో అజింక్యా రహానే (Ajnkya Rahane) సారథ్యంలోని ముంబై విజేతగా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ముషీర్ ఖాన్(Musheer Khan) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. యువ పేసర్ కొతియాన్ బంతితో విజృంభించాడు. దాంతో, ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి రంజీ చాంపియన్‌గా అవతరించింది.