IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) 18వ ఎడిషన్‌లో అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను ఆరంభించిన ముంబై.. ప్రత్యర్థుల భరతం పడుతోంది. ఒకదశలో అట్టడుగున నిలిచిన మాజీ ఛాంపియన్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగుతుండడంతో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సేన ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇదే జోరు చూపిస్తే ఈసారి ముంబై టైటిలో రేసుకు అర్హత సాధించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
రోహిత్ శర్మ నేతృత్వంలో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై.. సీఎస్కే మాదిరిగానే ప్రతి సీజన్లోనూ ఫేవరెట్. కానీ, గత 13 ఏళ్లుగా ఆరంభ పోరులో ఓటమి చవిచూస్తున్న ముంబై ఆ తర్వాత ఫీనిక్స్ పక్షిలా దూసుకొచ్చింది. 2013 నుంచి ఇదే తీరు కొనసాగుతోంది. అయితే.. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ 2015, 2017, 2019, 2020లో ముంబై కప్పును ఎగరేసుకుపోయింది. 18వ ఎడిషన్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది.
మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) చేతిలో 36 పరుగులతో పరాజయం పాలైంది. అయితే.. సొంతగడ్డపై పంజా విసిరిన పాండ్యా సేన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాను చిత్తు చేసింది. కానీ, మళ్లీ వరుసగా రెండు మ్యాచుల్లో ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌పై చేతులెత్తేసింది. ఈ రెండు ఓటముల నుంచి తేరుకున్న ముంబై.. మళ్లీ విజయాల బాట పట్టింది. ఓటమెరుగని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ముచ్చెమటలు పట్టించి 12 పరుగులతో జయభేరి మోగించింది. ఆ తర్వాత వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైలపై విక్టరీ కొట్టి ఆరో స్థానానికి ఎగబాకింది.
ముంబై పుంజుకోవడంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(Ryan Rickleton)లు కీలక పాత్ర పోషించారు. శుభారంభాలు ఇస్తున్న ఈ ఇద్దరు మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గిస్తున్నారు. హిట్‌మ్యాన్ 7 మ్యాచుల్లో 158 రన్స్ చేయగా.. రియాన్ 208 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యాలు మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని భయపెడుతున్నారు.
Hardik bhai, our Sunday definitely Sundayed 💪🔥 https://t.co/G3Rx09lvuS
— Mumbai Indians (@mipaltan) April 20, 2025
గత మూడు మ్యాచుల్లో ముంబై పైచేయి సాధించడంలో పేసర్లు దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ల కృషి ఎనలేనిది. కెప్టెన్ హార్దిక్ మిడిల్ ఓవర్లలో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు 11 వికెట్లు పడగొట్టాడు. ఇక డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్లతో బెంబేలెత్తిస్తుంటే.. శాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ముంబై తర్వాతి పోరులో సన్‌రైజర్స్‌ను ఏప్రిల్ 23న ఢీ కొట్టనుంది.