చెర్ల, ఏప్రిల్ 21 : భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల వాసి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డీఎస్పీ కర్రి కసి విశ్వేశ్వర (కేకేవీ) రెడ్డికి అత్యున్నత పురస్కారం దక్కింది. గత 36 ఏళ్ల సర్వీస్‌లో ఎస్పీజీ సహా పలు కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించినందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ (విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీసు పతకం) అందుకున్నారు. సీఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న మధ్యప్రదేశ్‌లోని నీమూచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేకేవీ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
కేకేవీ రెడ్డి సీఆర్పీఎఫ్లో 36 ఏళ్లుగా వివిధ హోదాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచేశారు. ప్రధాన మంత్రులకు భద్రతకు కల్పించే అత్యంత కీలక బలగమైన ఎస్పీజీలో సుదీర్ఘంగా 11 ఏళ్లు పని చేశారు. ఎస్పీజీలో పనిచేస్తున్న సమయంలో ఉత్తమ సేవలకు గాను కేకేవీ రెడ్డికి 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ దక్కింది. ఈ అవార్డును 2017లో న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందుకున్నారు. కేకేవీ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ రామంతపూర్‌లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.