Pinarayi Vijayan | ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ సినిమా కేరళ రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ఒక ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అని ఆయన అభివర్ణించారు. శాంతియుత వాతావరణం కలిగిన కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా జరుగుతోందని ఆయన ఆరోపించారు.
కోర్టులు, దర్యాప్తు సంస్థలు గతంలోనే తోసిపుచ్చిన ‘లవ్ జిహాద్’ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. అక్షరాస్యత మరియు సామాజిక అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసే ఇటువంటి చిత్రాలను ప్రజలు ఐక్యంగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రం కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మత మార్పిడి అంశాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా విషయంలో అటు అధికార ఎల్.డి.ఎఫ్ తో పాటు ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది.