Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ఉన్న టైటిల్ వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడింది. ఈ టైటిల్ ఇప్పటికే మరో దర్శకుడు రిజిస్టర్ చేయించుకోవడంతో రాజమౌళి సినిమా పేరుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఇప్పుడు ఎలాంటి వివాదం లేకుండా ఆ సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది. ‘వారణాసి’ టైటిల్‌ను దర్శకుడు సీహెచ్. సుబ్బారెడ్డి 2023లో ఫిలిం ఛాంబర్లో తన నిర్మాణ సంస్థ పేరిట అధికారికంగా రిజిస్టర్ చేయించారు. ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో తెరకెక్కించిన ‘రఫ్’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన ఆయన, అదే టైటిల్‌తో సనాతన ధర్మం నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలో ప్రకటించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఇదే సమయంలో రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ చిత్రానికి కూడా ‘వారణాసి’ అనే పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు రావడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. టైటిల్ విషయంలో వివాదం తలెత్తుతుందనే ప్రచారం జరిగినా, దర్శకుడు సుబ్బారెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా, ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా ‘వారణాసి’ టైటిల్‌ను రాజమౌళి చిత్రానికి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్‌తో కలిసి నిర్మాత కేఎల్ నారాయణను కలిసి ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘వారణాసి’ తనకు కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదు, ఓ భావోద్వేగమని చెప్పారు. టైటిళ్లను వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న భారీ చిత్రానికి ఈ టైటిల్ ఉపయోగపడడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇక దర్శకుడు వీరశంకర్ కూడా సుబ్బారెడ్డి నిర్ణయాన్ని అభినందించారు. పరిశ్రమ ప్రయోజనాల కోసం పరస్పరం సహకరించుకోవడం మంచి సంప్రదాయమని, భవిష్యత్‌లో టైటిల్ వివాదాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రాజమౌళి తెరకెక్కిస్తున్న*‘వారణాసి’ లో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు.