హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్లు బీఆర్ఎస్ సాగించిన పోరాటంతోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగందర్పై అనర్హత వేటు పడిందని ఆ పార్టీ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందిపై అనర్హత వేటు పడటం ఖాయమని జోస్యం చెప్పారు. నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని తెలిపారు.